అంతా తూచ్.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న క్వింటన్ డి కాక్

Published : Sep 22, 2025, 03:55 PM IST

Quinton de Kock: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ క్వింటన్ డి కాక్ తన వన్డే క్రికెట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. పాకిస్థాన్ పర్యటన కోసం సౌతాఫ్రికా వన్డే, టీ20 జట్లలో ఎంపికయ్యాడు.

PREV
15
రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గిన క్వింటన్ డి కాక్

దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ తన వన్డే రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఆయన పాకిస్థాన్ పర్యటనలో జరిగే వన్డేలు, టీ20లకు సౌతాఫ్రికా జట్టులో చోటు సంపాదించాడు. అంతేకాక అక్టోబర్ 11న నమీబియాతో జరిగే ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌లోనూ ఆయన ఆడనున్నాడు.

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత డి కాక్ వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. ఆయన చివరిసారి దక్షిణాఫ్రికా తరఫున 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో బార్బడోస్‌లో ఆడాడు. అప్పటి నుండి ఆయన జట్టులో కనిపించలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లలో పాల్గొన్నాడు.

25
క్వింటన్ డికాక్ రాకతో సౌతాఫ్రికాకు మరింత బూస్ట్

ప్రస్తుత దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రీ కాన్రాడ్ మాట్లాడుతూ.. “క్వింటన్ తిరిగి రావడం జట్టుకు ఒక పెద్ద బూస్ట్. గత నెల ఆయనతో భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు, ఆయనకు ఇంకా జాతీయ జట్టుపై ఆసక్తి ఉందని తెలిసింది. ఆయన క్రికెట్ ప్రతిభ అందరికీ తెలుసు. ఆయన తిరిగా రావడం జట్టుకు మేలు చేస్తుంది” అని అన్నారు.

క్వింటన్ డి కాక్ గతంలో 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్ దృష్ట్యా తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని సూచించాడు. అప్పట్లో "అది జరగదని అనుకుంటున్నాను. కానీ జీవితంలో ఎన్నో వింతలు జరుగుతాయి. ఒకవేళ జరగవచ్చు" అని కామెంట్స్ చేయడం గమనార్హం.

35
క్వింటన్ డి కాక్ కెరీర్ గణాంకాలు

క్వింటన్ డి కాక్ ఇప్పటివరకు 155 వన్డేలు ఆడి 6770 పరుగులు సాధించాడు. ఆయన సగటు 45.74, స్ట్రైక్‌రేట్ 96.64.

టీ20ల్లో 92 మ్యాచ్‌ల్లో 2584 పరుగులు సాధించాడు. ఆయన స్ట్రైక్‌రేట్ 138.32. అలాగే ఆయన 2015, 2019, 2023 ప్రపంచకప్‌లలో ఆడాడు. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని మాత్రం ఆయన కోల్పోయాడు.

45
పాకిస్థాన్ పర్యటనకు సౌతాఫ్రికా

దక్షిణాఫ్రికా పాకిస్థాన్‌లో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

• అక్టోబర్ 12న తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ అక్టోబర్ 20న మొదలవుతుంది.

• టీ20లు అక్టోబర్ 28, 31, నవంబర్ 1న జరుగుతాయి.

• వన్డేలు నవంబర్ 4, 6, 8 తేదీల్లో జరుగుతాయి.

55
బవుమాకు గాయం.. ఐడెన్ మార్క్రామ్ కు కెప్టెన్సీ

దక్షిణాఫ్రికా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా పాకిస్థాన్ పర్యటనలో టెస్టులకు దూరమయ్యాడు. ఆయనకు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరం. ఈ నేపథ్యంలో ఐడెన్ మార్క్రామ్ టెస్ట్ జట్టును నడిపించనున్నాడు.

కోచ్ కాన్రాడ్ మాట్లాడుతూ, “బవుమా లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. కానీ మాకు ఉపఖండంలో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వారు ఈ సవాలు స్వీకరిస్తారు” అని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories