South Africa vs Australia: సౌతాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆసీస్‌పై 5 వికెట్లతో విజయం సాధించి ప్రోటీస్ జట్టు తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించింది.
WTC Final 2025: 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఆ దేశ క్రికెట్ చరిత్రలో కీలక మలుపు. 27 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌ను గెలుచుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో, సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి, తన మొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ను అందుకుంది.
26
WTC Final 2025: మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆధిక్యం
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది. వెబ్ స్టర్ 72, స్టీవ్ స్మిత్ 66 పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడా 5 వికెట్లు, మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశారు.
తర్వాత, సౌతాఫ్రికా జట్టు 138 పరుగులకే ఆలౌట్ అయింది. డేవిడ్ బెడింగమ్ 45, బవుమా 36 పరుగులు చేశారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి సఫారీ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. దీంతో ఆసీస్‌కు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
36
WTC Final 2025: రెండవ ఇన్నింగ్స్‌లో ఆట మళ్లీ మారింది
ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కంగారూ జట్టు సౌతాఫ్రికాకు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ బౌలర్లు మ్యాచ్‌లో కీలకంగా నిలిచారు. ఆ తర్వాత బ్యాటర్లు కూడా అదరగొట్టారు.
WTC Final 2025: ఐడెన్ మార్క్రమ్ - టెంబా బవుమా మ్యాజిక్
సౌతాఫ్రికా రెండవ ఇన్నింగ్స్‌లో ధైర్యంగా బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్రమ్ 136 పరుగుల అద్భుత సెంచరీ కొట్టి జట్టును విజయపథంలోకి తీసుకెళ్లాడు. టెంబా బవుమా 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముల్డర్ 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
మార్క్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 పరుగులు చేసి చివరికి జట్టు విజయం వద్ద నిలిచినప్పుడు ఔటయ్యాడు. కానీ అప్పటికే మ్యాచ్ దాదాపు సౌతాఫ్రికా కైవసం అయింది.
56
WTC Final 2025: 1998 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ గెలిచిన ప్రోటీస్ జట్టు
ఇది సౌతాఫ్రికా గెలిచిన రెండో ఐసీసీ ట్రోఫీ. గతంలో 1998లో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్‌లో విజయం సాధించింది. అనంతరం చాలా సార్లు సెమీఫైనల్, ఫైనల్ దశల్లో ఓటమి పాలై, “చోకర్స్” అన్న ముద్రను మూటగట్టుకున్న సౌతాఫ్రికా, ఇప్పుడు ఆ ముద్రను తొలగించుకుంది. చోకర్స్ కాదు ఛాంపియన్స్ అని నిరూపించుకుంది.
66
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ - ప్రతి సారి కొత్త ఛాంపియన్
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ లో ఇది మూడో సీజన్. మొదటిసారి (2019–2021) న్యూజిలాండ్, రెండవసారి (2021–2023) ఆస్ట్రేలియా విజయం సాధించగా, ఈసారి (2023–2025) సౌతాఫ్రికా విజేతగా అవతరించింది. ప్రతి సీజన్‌లోనూ కొత్త విజేతలు రావడం విశేషం.
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ భారత్ మొదటి రెండు సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. మూడో సీజన్ లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.