స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్

Published : Oct 06, 2026, 10:50 PM IST

Smriti mandhana: భారత మహిళల క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు జట్టుకు సారథ్యం వహించిన హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడంతో.. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు బీసీసీఐ కొత్త బాధ్యతలు అప్పగించింది.

PREV
14
కెప్టెన్సీపై స్మృతి మంధాన ఏమన్నారంటే?

వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత మహిళల జట్టుకు ఆమె పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్మృతి వ్యవహరించనున్నారు. అక్టోబర్ 6న బీసీసీఐ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం దక్కడం తనకు ఎంతో ప్రత్యేకమైన గౌరవమని స్మృతి మంధాన పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలెక్టర్లు, సహచర ఆటగాళ్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కెప్టెన్‌గా వచ్చే బాధ్యతలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెబుతూ.. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. జట్టు విజయాల కోసం అందరితో కలిసి పనిచేస్తానని తెలిపారు.

24
హర్మన్‌ప్రీత్ కౌర్ సేవలకు ప్రశంసలు

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్‌కు స్మృతి మంధాన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్ల పాటు జట్టును ముందుండి నడిపిన హర్మన్‌ప్రీత్‌ నిబద్ధతను ప్రశంసించారు. ఆమె అందించిన సేవలు భారత మహిళా క్రికెట్‌కు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సారథ్య బాధ్యతలు చేపడుతున్న సమయంలో హర్మన్‌ప్రీత్ అనుభవాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతాననే సంకేతాన్ని స్మృతి ఇచ్చారు.

34
నాయకత్వంలో స్మృతికి ఇప్పటికే మంచి అనుభవం

స్మృతి మంధానకు కెప్టెన్సీ కొత్త కాదు. గతంలో భారత జట్టుకు 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో, 4 వన్డేల్లో సారథ్యం వహించారు. అంతేకాకుండా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విజయవంతంగా నడిపించారు. 2024, 2026 సీజన్లలో ఆర్సీబీ టైటిల్ సాధించడంలో ఆమె నాయకత్వం కీలకంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను సమన్వయం చేయడంతో పాటు ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు.

44
స్మృతి ఎంపికపై బీసీసీఐ పెద్దల అభినందనలు

కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా స్వాగతించారు. ఆటపై ఆమెకు ఉన్న అవగాహన, అంతర్జాతీయ అనుభవం, జట్టు పట్ల నిబద్ధత భారత మహిళల జట్టుకు ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీని విజయవంతంగా నడిపించిన అనుభవం స్మృతికి అదనపు బలమని అభిప్రాయపడ్డారు. ఆమె నాయకత్వంలో భారత మహిళల జట్టు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుందని బీసీసీఐ పెద్దలు ఆకాంక్షించారు.

Read more Photos on
click me!

Recommended Stories