R Ashwin Retirement : భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. అతను తన చివరి ఐపీఎల్ సీజన్ ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడారు.
భారత క్రికెట్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున అరంగేట్రం చేసిన అశ్విన్.. 2025 సీజన్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముగించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది డిసెంబర్‌లోనే వీడ్కోలు పలికిన ఈ ఆఫ్ స్పిన్నర్, ఇప్పుడు విదేశీ క్రికెట్ లీగ్‌ల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
అశ్విన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదిక X లో వెల్లడించారు. “ఒక ప్రత్యేకమైన రోజు, అందుకే కొత్త ఆరంభం. నా ఐపీఎల్ ప్రయాణం ఇక్కడితో ముగుస్తోంది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌ల్లో ఆడేందుకు నా కొత్త అధ్యాయం మొదలవుతోంది” అని ఆయన తెలిపారు
DID YOU KNOW ?
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ చాహల్
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. ఇప్పటివరకు 221 వికెట్లు పడగొట్టారు. 5వ స్థానంలో ఉన్న అశ్విన్ 221 మ్యాచ్‌లు ఆడి 30.22 బౌలింగ్ సగటు, 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టారు.
25
ఐపీఎల్ 16 సీజన్లు ఆడిన అశ్విన్
అశ్విన్ తన 16 సీజన్ల ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 187 వికెట్లు తీశారు. ఆయన బౌలింగ్ సగటు 30.22 కాగా, ఎకానమీ రేట్ 7.20, స్ట్రైక్ రేట్ 25.2. ఉత్తమ బౌలింగ్ ఫిగర్స్ 4/34 వికెట్లు.
బ్యాట్స్‌మన్‌గా కూడా అశ్విన్ రాణించారు. 92 ఇన్నింగ్స్‌ల్లో 833 పరుగులు సాధించారు. 118.15 స్ట్రైక్ రేట్, 13.01 సగటుతో తన బ్యాటింగ్ కొనసాగించారు. ఐపీఎల్ లో అశ్విన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 50 పరుగులు.
35
చెన్నై సూపర్ కింగ్స్‌తో అశ్విన్ ఐపీఎల్ ప్రయాణం
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అశ్విన్ ఎన్నో మధుర క్షణాలను అందించారు. 2010, 2011లో ఐపీఎల్ టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2010లో ఛాంపియన్స్ లీగ్ టి20లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. 2011 ఐపీఎల్ ఫైనల్లో మొదటి ఓవర్ వేసి, క్రిస్ గేల్‌ను డక్ అవుట్ చేసి జట్టును విజయం వైపు నడిపించారు. 2014లో మరోసారి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచారు.
2025లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అశ్విన్ ను రూ. 9.75 కోట్లు వెచ్చించి తిరిగి జట్టులోకి తీసుకుంది. కానీ, ఇక్కడ అశ్విన్ ప్రదర్శన ఆశించినంతగా రాలేదు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశారు. ఎకానమీ రేట్ 9.12గా నమోదైంది.
చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు మరో నాలుగు ఐపీఎల్ జట్లకు అశ్విన్ ఆడారు. అశ్విన్ రైజింగ్ పుణే సూపర్ జెయింట్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా ఆడారు. పంజాబ్ కింగ్స్‌కు 2018లో కెప్టెన్‌గా వ్యవహరించారు. రాజస్థాన్ తరఫున యజ్వేంద్ర చాహల్‌తో కలిసి అద్భుతమైన స్పిన్ జోడీగా నిలిచారు. మొత్తంగా ఐపీఎల్‌లో 187 వికెట్లు తీసి, ఆల్‌టైమ్ టాప్ 5 బౌలర్లలో చోటు సంపాదించారు.
55
విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టిన అశ్విన్
బీసీసీఐ నియమాల ప్రకారం, ఏ భారత క్రికెటర్ అయినా విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఈ నియమాన్ని అనుసరించి అశ్విన్ తాజాగా ఐపీఎల్ కు వీడ్కోలు పలికారు. ఇకపై ఆయన ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL), దక్షిణాఫ్రికా SA20, యూఏఈ ILT20, ఇంగ్లాండ్ హండ్రెడ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) వంటి టోర్నమెంట్‌ల్లో ఆడే అవకాశముంది.
“ఫ్రాంచైజీలకు, ఐపీఎల్‌కు, బీసీసీఐకి కృతజ్ఞతలు. ముందున్న అవకాశాలను ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాను” అని అశ్విన్ పేర్కొన్నారు.