కోహ్లీ కాదు, రోహిత్ శ‌ర్మ కాదు.. స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేసేది ఏవ‌రు?

First Published | Aug 15, 2024, 10:45 PM IST

Sachin Tendulkar's records: టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. రెండు దశాబ్దాలకు పైగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 15921 టెస్టు పరుగులు చేశాడు.
 

Sachin Tendulkar's records: అంత‌ర్జాతీయ క్రికెట్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ అనేక రికార్డుల‌ను సృష్టించాడు. వాటిలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా ఉంది. రెండు దశాబ్దాలకు పైగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 15921 టెస్టు పరుగులు చేశాడు. అతని ఈ రికార్డును బద్దలు కొట్టే పోటీదారు ఎవరు?  విరాట్ కోహ్ల కాదు.. రోహిత్ శ‌ర్మ కాదు.. మ‌రి ఇంకెవ‌రు? టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును జో రూట్ బద్దలు కొట్టగలడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్, విరాట్ ల‌ను కాద‌ని ఎందుకు ఈ ప్లేయ‌ర్ పేరును చెప్పాన‌నే విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. 

sachin rohit

ఇంగ్లండ్ త‌ర‌ఫున ప్ర‌స్తుతం క్రికెట్ లో కొన‌సాగుతూ మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయ‌ర్ జో రూట్‌. అత‌ను టెస్టు క్రికెట్‌లో 12000 పరుగుల మార్క్‌ను దాటిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 143 టెస్టుల్లో 12027 పరుగులు చేశాడు. టెండూల్కర్ 200 టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. పాంటింగ్ 168 టెస్టుల్లో 13378 పరుగులు చేసి జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.


ఐసీసీ రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ.. ''రూట్ ఈ రికార్డును బద్దలు కొట్టగలడు. 33 ఏళ్ల వయసులో కేవలం 3000 పరుగుల వెనుకబడి ఉన్నాడు. చూద్దాం ఎన్ని టెస్టులు ఆడతాడో. ఏడాదికి 10 నుంచి 14 టెస్టులు ఆడి ఏటా 800 నుంచి 1000 పరుగులు సాధిస్తే మూడు-నాలుగేళ్లలో స‌చిన్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. త‌న పరుగుల ఆకలి అలాగే ఉంటే అతను దీన్ని సాధించ‌గ‌ల‌డు'' అని తెలిపాడు.

జో రూట్ ప్ర‌స్తుతం బ్యాటింగ్ ప్రదర్శన గురించి పాటింగ్ మాట్లాడుతూ.. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో రెండో స్థానంలో ఉన్నాడు. భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ 740 పరుగులతో టాప్ లో ఉన్నాడు. రూట్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో 611 పరుగులు చేశాడు. ఈ ఏడాది అతని అత్యుత్తమ స్కోరు 122 నాటౌట్. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లోనూ రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

అలాగే, జో రూట్ టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల‌ ర్యాంక్‌లను కూడా నిరంతరం పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని పేరు మీద 32 సెంచరీలు ఉన్నాయి. మరో సెంచరీ సాధిస్తే 32 టెస్టు సెంచరీలతో ఉన్న స్టీవ్ వా, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లను అధిగమిస్తాడు. అలాగే, మ‌రో రెండు సెంచరీలు చేస్తే  లెజెండ‌రీ ప్లేయ‌ర్లు సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, మహేల జయవర్ధనేల టెస్ట్ సెంచరీలను సమం చేస్తాడు. ఈ దిగ్గజాలు తమ టెస్టు కెరీర్‌లో 34 సెంచరీలు సాధించారు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. రెడ్ బాల్ ఫార్మాట్‌లో 51 సెంచరీలు చేశాడు.

Latest Videos

click me!