Image Credit: ANI
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి చెందిన ముగ్గురు ప్లేయర్స్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి వేలంలో విగ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్ అనే ముగ్గురు ప్లేయర్స్‌ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తీసుకోవడమే కాదు తొలి మ్యాచ్‌లోనే వీరికి స్థానం కల్పించారు.
దీంతో యంగ్ ట్యాలెంట్‌ను ప్రమోట్ చేయడానికి ముంబై ఇండియన్స్ పెద్ద పీట వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఈ ముగ్గురు ప్లేయర్స్ కుటుంబ నేపథ్యంలో. పేద కుటుంబంలో జన్మించిన వీరు ఇప్పుడు ఐపీఎల్‌లో తళుక్కుమనే స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ప్లేయర్స్ బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకుందాం..
Sathya narayana raju
సత్యనారాయణ రాజు మన తెలుగు కుర్రాడే..
సత్యనారాయణ రాజు కాకినాడకు చెందిన ప్లేయర్. రాజు తండ్రి రొయ్యల వ్యాపారి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజు ఐపీఎల్ ఆడే స్థాయికి చేరుకోవడం నిజంగానే గొప్ప విషయమని చెప్పాలి. సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. రాజు క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2024లో తన ఆటతీరుతో ప్రపంచానికి పరిచమయ్యాడు. ఈ రైట్ హాండ్ ఫాస్ట్ బౌలర్ రాయలసీమ కింగ్స్ తరపున ఏడు మ్యాచ్‌ల్లో 6.15 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు.
vignesh
ఆటో డ్రైవర్ కొడుకు విగ్నేష్ పుతుర్:
కేరళ రాష్ట్రానికి చెందిన విగ్నేష్ పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. పేద కుటుంబానికి చెందిన విగ్నేష్ తన అకుంఠిత దీక్షతో క్రికెట్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. కేరళా క్రికెట్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ వంటి వాటిలో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ మెగా వేలంలో విగ్నేష్‌ను రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విగ్నేష్‌ను ఇటీవల సౌతాఫ్రికాకు పంపించి ప్రత్యేకంగా శిక్షణ అందించారు.
Robin minj
రాబిన్ మింజ్:
ముంబై ఇండియన్స్ టీమ్‌లో వచ్చిన మరో యంగ్ ప్లేయర్ రాబిన్ మింజ్. జార్ఖండ్‌కు చెందిన గిరిజన ముద్దు బిడ్డ రాబిన్ మింజ్. ఐపీఎల్‌లో ఆడిన తొలి భారత గిరిజన క్రికెటర్‌గా రాబిన్ చరిత్ర సృష్టించాడు. నిజానికి రాబిన్ మింజ్‌ను 2024లో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే బైక్ యాక్సిడెంట్ కావడంతో గతేడాది సీజన్‌కు దూరమయ్యాడు. తాజాగా తిరిగి కోలుకున్న రాబిన్‌ను ముంబై ఇండియన్స్ ఏకంగా రూ. 65 లక్షలకు సొంతం చేసుకుంది. రాబిన్ పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈయన తండ్రి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్. కొడుకు క్రికెటర్‌గా రాణిస్తున్న సమయంలోనూ తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.