SA vs Ind ODI: సౌతాఫ్రికా కెప్టెన్ ను చూసి నేర్చుకో.. అతడిని సరిగా వాడుకో : కెఎల్ రాహుల్ కు జహీర్ ఖాన్ సూచన

First Published Jan 21, 2022, 1:30 PM IST

Zaheer Khan Advice To KL Rahul: రెండో వన్డేకు ముందు  భారత మాజీ  పేసర్ జహీర్ ఖాన్.. టీమిండియా తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ కు విలువైన సూచనలు చేశాడు. అంతేగాక... 
 

ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య పార్ల్ వేదికగా బుధవారం ముగిసిన తొలి వన్డేలో  టీమిండియా సారథి కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు  వచ్చిన విషయం తెలిసిందే. బౌలర్లను అతడు ప్రయోగించిన తీరు.. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లు.. బ్యాటింగ్ ఆర్డర్.. తదితర అంశాల మీద  పలువురు సీనియర్లు  అతడిని  బహిరంగంగానే విమర్శించారు. 

తాజాగా ఇదే విషయమై  భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ స్పందించాడు. కెఎల్ రాహుల్.. దక్షిణాఫ్రికా సారథి తెంబ బవుమా ను చూసి నేర్చుకోవాలని సూచించాడు. అందుబాటులో ఉన్న వనరులను బవుమా ఎలా వాడుకుంటున్నాడో అతడి దగ్గర రాహుల్ నేర్చుకోవాలని అన్నాడు.

జహీర్ ఖాన్ మాట్లాడుతూ... ‘బవుమా తన వనరులను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. అతడిని చూసి రాహుల్ నేర్చుకోవాలి. బవుమా..   స్పిన్నర్లు, సీమర్లను ప్రత్యేకంగా ప్రయోగించలేదు. నీకు అందుబాటులో ఉన్న వనరులను నువ్వు బాగా వాడుకోగలగాలి...’ అని అన్నాడు. 
 

ఇక వెంకటేశ్ అయ్యర్ కు మరిన్ని అవకాశాలు కల్పించాలని, అప్పుడే అతడు రాటుదేలుతాడని  జహీర్ అన్నాడు. అంతేగాక అతడికి బౌలింగ్ చేసే అవకాశమివ్వాలని సూచించాడు. 

‘మీరు అతడికి బంతిని ఇవ్వాలి. బౌలింగ్ చేయనివ్వాలి. మ్యాచ్ పరిస్థితుల గురించి వదిలేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా ప్లానింగ్ (ప్రపంచకప్ ను ఉద్దేశిస్తూ) అందుకు తగిన ప్రణాళికలను ఇప్పట్నుంచే అమలు చేయాలి.
 

ఒక ఆటగాడు అతడి వైఫల్యాల నుంచే నేర్చుకుంటాడు. అనుభవాన్ని మార్కెట్ లో కొనుగోలు చేయలేం.  అయ్యర్ ఒకవేళ నాలుగైదు మ్యాచులు ఆడి అతడిని బౌలింగ్ చేయకుండా చేసి ఆల్ రౌండర్ కాదనడంలో అర్థం లేదు. అతడు బౌలింగ్ చేస్తేనే కదా.. అతడి తప్పొప్పుల గురించి తెలుస్తుంది. తద్వారా అతడు మెరుగవుతాడు...’ అని అన్నాడు. 
 

గత మ్యాచులో దక్షిణాఫ్రికా సారథి బవుమా, డసెన్ లు భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ లను ధీటుగా ఎదుర్కుంటున్నా రాహుల్  మాత్రం వెంకటేశ్ కు బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు కొత్త బౌలర్ ను ప్రయోగించి ఉండాల్సింది అని రాహుల్ పై మ్యాచ్ అనంతరం విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 
 

click me!