Sachin Tendulkar: రోడ్ సేఫ్టీ సిరీస్ నుంచి తప్పుకున్న మాస్టర్ బ్లాస్టర్.. కారణమిదే..

First Published Jan 21, 2022, 11:10 AM IST

Road Safety World Series 2022:  భారత క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట చూద్దామనుకున్న ప్రేక్షకులకు  నిరాశే మిగిలింది. మార్చిలో జరగాల్సి ఉన్న రోడ్ సేఫ్టీ సిరీస్ నుంచి సచిన్ తప్పుకున్నాడు. 
 

మాజీ క్రికెటర్లను ఒక్క చోటుకు  చేర్చి నిర్వహిస్తున్న ‘రోడ్ సేఫ్టీ  వరల్డ్ సిరీస్’ నుంచి  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తప్పుకున్నాడు. వచ్చే సీజన్ లో అతడు ఈ సిరీస్ లో పాలు పంచుకోవడం లేదు. 

దుబాయ్ వేదికగా జరుగబోయే ఈ సిరీస్ మార్చి 1 నుంచి 19 వరకు నిర్వహించాల్సి ఉంది. గతేడాది ప్రారంభమైన ఈ సిరీస్  లో తొలి సీజన్ ను  ఇండియా లెజెండ్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. 

అయితే ఈసారి మాత్రం ఈ సిరీస్ లో పాల్గొనడానికి సచిన్ తో పాటు చాలా మంది మాజీ క్రికెటర్లు విముఖత చూపిస్తున్నారట. ఇప్పటికే  బంగ్లాదేశ్ కు చెందిన పలువురు క్రికెటర్లు.. ఈ సీజన్ కు అందుబాటులో ఉండబోమని తేల్చి చెప్పారు. 

దీనికి ప్రధాన కారణం.. గతేడాదికి సంబంధించిన చెల్లింపులే ఇంకా  రాలేదని పలువురు బంగ్లా క్రికెటర్లు వాపోతున్నారు. సచిన్ కూడా  ఈ కారణంతోనే ఈ ఏడాది రోడ్ సేఫ్టీ సిరీస్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. 
 

‘సచిన్ ఈ సీజన్ లో భాగం కావడం లేదు. యూఏఈ వేదికగా మార్చి 1 నుంచి 19 దాకా జరగాల్సి ఉన్న ఈ సిరీస్  నుంచి సచిన్ తప్పుకున్నాడు...’ అని ఈ సిరీస్ నిర్వాహకులు తెలిపారు. 
 

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం..  సిరీస్ లో పాల్గొనే ఆటగాళ్లకు చెల్లించే వేతనం ఒప్పందం చేసుకునే సమయంలో పది శాతం.. మిగతా 40 శాతం 2021 ఫిబ్రవరి 25 లోపు..  మిగిలిన 50 శాతం అదే ఏడాది మార్చి 31 లోపు ఇస్తామని  నిర్వాహకులు డీల్ కుదుర్చుకున్నారు. 
 

కానీ.. సచిన్ కు ఇంతవరకు పూర్తి చెల్లింపులు చేయలేదని తెలుస్తున్నది. సచిన్ తో పాటు బంగ్లా మాజీ క్రికెటర్లు ఖలీద్ మహ్మద్, ఖలీద్ మసూద్, మెహ్రాబ్ హుస్సేన్, రాజిన్ సాలే, హన్నన్ సర్కార్, నఫీస్ ఇక్బాల్ వంటి ఆటగాళ్లకు కూడా చెల్లింపులు చేయలేదు. దీంతో వాల్లు కూడా ఈ సీజన్ నుంచి  తప్పుకున్నారు. 

click me!