
మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిపించే టీమిండియా యంగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అయితే ఈసారి అతడు వికెట్ల వెనక చేసిన కీపింగ్ వల్లో లేక స్టేడియంలో బాదిన సెంచరీ వల్లో వార్తల్లో నిలవలేదు. ఏకంగా ఒక బ్యాంక్ ఆఫీసులో ఫార్మల్ డ్రెస్సింగ్, మెడలో ఐడీ కార్డుతో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచాడు.
బీహార్ రాజధాని పట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రీజనల్ ఆఫీస్‌లో ఇషాన్ కిషన్ సీరియస్‌గా విధులు నిర్వర్తిస్తూ కనిపించాడు. అక్కడి బ్యాంక్ సిబ్బందితో కలిసి డిపాజిట్లు, రుణాలు, ఇతర అధికారిక ఫైళ్లను పరిశీలిస్తూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్ చూసిన అభిమానులు ఇషాన్ ఏమైనా సడన్‌గా క్రికెట్‌కు గ్యాప్ ఇచ్చి బ్యాంక్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాడా అని షాక్ తింటున్నారు.
Ishan Kishan at Reserve Bank of India Patna 🔥
- Cricket off season, Banking job for Ishan. pic.twitter.com/ayrq1Chybq— Johns. (@CricCrazyJohns) August 5, 2026
ఈ వైరల్ ఫొటోల వెనుక ఉన్న అసలు మేటర్ ఏంటంటే.. ఇషాన్ కిషన్‌కు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 'అసిస్టెంట్ మేనేజర్'గా ఉద్యోగం లభించింది. రీసెంట్‌గా టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన రెండు టెస్టుల సిరీస్‌లో ఇషాన్‌కు స్థానం దక్కలేదు. దీంతో దాదాపు నెల రోజులకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లేవీ లేకపోవడంతో, లభించిన ఈ ఖాళీ సమయాన్ని వేస్ట్ చేయకుండా పట్నాలోని ఆర్‌బీఐ ఆఫీసుకు వెళ్లి తన అధికారిక బాధ్యతలను నిర్వర్తించాడు.
బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పనిచేసే ఉద్యోగులకు నెలకు దాదాపు రూ. 1.22 లక్షల నుంచి రూ. 1.24 లక్షల వరకు గ్రాస్ సాలరీ ఉంటుంది. పీఎఫ్, టాక్స్‌లు, ఇతర కటింగ్స్ పోను ప్రతినెలా నికరంగా రూ. 1.08 లక్షల నుంచి రూ. 1.12 లక్షల వరకు ఇన్-హ్యాండ్ జీతం లభిస్తుంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా ఇదే హోదాలో విధులు నిర్వర్తిస్తుండటంతో అతనికి కూడా ఇదే స్థాయిలో వేతనం అందుతోంది.
🚨 ISHAN KISHAN WORKING AS A BANKER 🤯
Ishan Kishan has been keeping busy away from the cricket field these days by taking up a regular job at a local bank in Jharkhand, handling customer accounts and paperwork while the Indian team has no matches scheduled. With the… pic.twitter.com/RLdT1CTr1H— Venky Mama (@venkymama100) August 4, 2026
బ్యాంక్ ఆఫీస్‌కు వచ్చిన ఇషాన్ కిషన్‌ను చూసి తోటి సిబ్బంది, ఇతర ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్ పనివేళల్లో అతడితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఇషాన్ కూడా ఎంతో వినయంగా వారితో కలిసి గ్రూప్ ఫొటోలు దిగాడు. కోట్లాది రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టులు, జాతీయ జట్టులో స్టార్ డమ్ ఉన్నప్పటికీ.. తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఎంతో బాధ్యతగా గుర్తుంచుకుని ఆఫీసుకు రావడంపై నెటిజన్లు ఇషాన్ కిషన్ నిబద్ధతను ప్రశంసిస్తున్నారు.
గతంలో టీమిండియా లెజెండ్స్ మహేంద్రసింగ్ ధోనీ, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు కూడా క్రీడా కోటా ఉద్యోగాల్లో కొనసాగుతూనే జాతీయ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించారు. స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చే ఉద్యోగాల్లో ప్రాక్టీస్ చేయడానికి, టోర్నమెంట్లలో పాల్గొనడానికి పూర్తి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఉద్యోగం చేయడం వల్ల ఇషాన్ క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఆటంకం కలగదు.
ప్రస్తుతం లభించిన చిన్న బ్రేక్‌ను బ్యాంక్ ఉద్యోగానికి కేటాయించినప్పటికీ.. ఇషాన్ చూపు మాత్రం మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంపైనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో 2022లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో అత్యంత పిన్న వయస్కుడిగా డబుల్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇటీవల టీ20 ప్రపంచకప్‌లోనూ, ఆ తర్వాత ఐపీఎల్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు.
ఆగస్ట్ 23 నుంచి ప్రారంభం కానున్న 'దులీప్ ట్రోఫీ 2026'లో ఈస్ట్ జోన్ టీమ్‌కు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో నార్త్ జోన్‌తో ఈస్ట్ జోన్ తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌తో ఇషాన్ మళ్లీ టీమిండియా బ్లూ జెర్సీలో మైదానంలో సందడి చేయనున్నాడు.