
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రయాణం ముగిసింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన హై-స్కోరింగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 47 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఘోరంగా ఓడించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, ఈ కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి దారితీసిన 5 ప్రధాన కారణాలు గమనిస్తే..
సన్‌రైజర్స్ ఓటమికి అత్యంత ప్రధాన కారణం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి హైదరాబాద్ బౌలింగ్‌ను ముక్కలు ముక్కలు చేశాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సన్‌రైజర్స్ బౌలర్లు వేసిన యార్కర్లు, స్లోయర్ డెలివరీలు, షార్ట్ పిచ్ బంతులు.. ఇలా దేన్నీ వదలకుండా స్టేడియం దాటించాడు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేయగా, అందులో సూర్యవంశీ చేసిన పరుగులే ఎక్కువ. ఇతని విధ్వంసం వల్లే రాజస్థాన్ అంతటి భారీ స్కోరు చేయగలిగింది.
సూర్యవంశీ 8వ ఓవర్లో అవుట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ బౌలర్లకు ప్రశాంతత దక్కలేదు. వన్ డౌన్ లో వచ్చిన ధృవ్ జురెల్ కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి మొమెంటం తగ్గకుండా చూసుకున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు.
కమిన్స్ తన 4 ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. అతని టీ20 కెరీర్‌లోనే ఇది అత్యంత ఖరీదైన స్పెల్ కావడం గమనార్హం. హుస్సేన్ 4 ఓవర్లలో 52 పరుగులు, ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి భారీగా పరుగులు ఇచ్చాడు.
244 పరుగుల భారీ టార్గెట్ చేజ్ చేయాలంటే సన్‌రైజర్స్‌కు పవర్ ప్లేలో అదిరిపోయే స్టార్ట్ కావాలి. కానీ, రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్‌ను పవర్ ప్లేలోనే కూల్చేశాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మను ఇన్నింగ్స్ రెండో బంతికే డక్ అవుట్ (0) చేసి ఆర్చర్ భారీ షాక్ ఇచ్చాడు.
ఈ ఏడాది టీ20ల్లో అభిషేక్ శర్మకు ఇది 8వ డక్ కావడం గమనార్హం. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రమాదకరంగా మారుతున్న ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33 పరుగులు) ను కూడా ఆర్చర్ పెవిలియన్‌కు పంపాడు. పవర్ ప్లే లోపలే సన్‌రైజర్స్ ప్రధాన వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది.
కీలక మ్యాచ్‌ల్లో జట్టును గెలిపిస్తారని నమ్ముకున్న స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ట్రావిస్ హెడ్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నిలబెడతాడనుకున్న హెన్రిచ్ క్లాసెన్ కూడా నిరాశపరిచాడు. యష్ రాజ్ పుంజా వేసిన 7వ ఓవర్లో రివర్స్ స్వీప్ ఆడబోయి 18 పరుగులకే ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. దీంతో 83 పరుగులకే సన్‌రైజర్స్ 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (20 బంతుల్లో 38 పరుగులు), సలీల్ అరోరా (21 బంతుల్లో 35 పరుగులు) కాసేపు మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, రవీంద్ర జడేజా తన అనుభవాన్ని ఉపయోగించి ఒకే ఓవర్లో నితీష్ రెడ్డిని, ఆ తర్వాత ఓవర్లో సలీల్ అరోరాను అవుట్ చేసి హైదరాబాద్ ఆశలపై నీళ్లు చల్లాడు.
జడేజా 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఒకవైపు రన్ రేట్ బాగానే ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం వల్ల సన్‌రైజర్స్ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. చివరికి శివాంగ్ కుమార్ (27) అవుట్ కావడంతో సన్‌రైజర్స్ కథ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు, నండ్రే బర్గర్ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లతో అద్భుతంగా రాణించారు.