IPL 2025 SRH vs MI: కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 28 మందికి పైగ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే బాధితులకు నివాళిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో ఎలాంటి సంబరాలు చేయకూడదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది.
దీనిలో భాగంగా బుధవారం (ఏప్రిల్ 23న) ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ బాధితులకు గౌరవ సూచకంగా, సానుభూతిని తెలుపుతూ ఎటువంటి బాణసంచా కాల్చరు. అలాగే, చీర్లీడర్లు లేకుండా మ్యాచ్ జరగనుంది.
Pahalgam terror attack
మంగళవారం మధ్యాహ్నం ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కాశ్మీర్ లోని పహల్గామ్‌లోని బైసరన్ పచ్చిక బయళ్ల సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది మరణించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2019 పుల్వామా సంఘటన తర్వాత కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.
Mumbai Indians and Sunrisers Hyderabad
నల్ల బ్యాండ్లు ధరించనున్న ఆటగాళ్లు, అంపైర్లు
కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులు, అంపైర్లు ఆట సమయంలో చేతికి నల్లటి బ్యాండ్‌లు ధరిస్తారు.
అంతేకాకుండా, మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ఒక నిమిషం పాటు మౌనం పాటించి, ఈ విషాదాన్ని గుర్తుచేసుకుని, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తూ నివాళులు అర్పిస్తారు..
SRH vs MI
దాడిని ఖండించిన క్రికెటర్లు
భారత క్రికెట్ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో తమ బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.
భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఎక్స్ వేదికగా "పహల్గామ్ ఉగ్రవాద దాడి తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. బాధితుల కుటుంబాలకు సానుభూతి. ఈ అర్థరహిత హింసాత్మక చర్యను ఖండిస్తున్నాను. ఈ క్లిష్ట సమయాల్లో ఐక్యత, మద్దతుతో మనం బలంగా నిలబడాలి అని పేర్కొన్నారు.
విరాట్ కోహ్లీ దీనిపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తూ బాధితులకు న్యాయం చేయాలన్నారు. "పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర విచారం కలిగించింది. బాధితుల కుటుంబాలకు అండగా నిలబడాలి. ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు శాంతి, బలం చేకూర్చాలనీ, ఈ క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను" అని కోహ్లీ పేర్కొన్నాడు.
అలాగే, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు. ఇది పిరికి చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం ఐపీఎల్ లో 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృనాల్ పాండ్యా దాడితో తన గుండె ముక్కలైందని పేర్కొన్నాడు. బాధితులకు అండగా నిలబడతామని చెప్పాడు.