
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ సీజన్ లో అందరి చూపు మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లపై ఉంటుంది. చాలా మంది ఆటగాళ్లు రూ. 20 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధరతో రికార్డుల మోత మోగించారు. అయితే, ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు 2024 IPL సీజన్‌లో ఎలా ఆడారో తెలుసా? ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
రిషబ్ పంత్
రిషబ్ పంత్ ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రారంభించి 8 ఏళ్ల పాటు అదే జట్టు తరఫున ఆడాడు. అయితే, ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. లక్నో టీమ్ పంత్‌ను రూ. 27 కోట్లకు వేలంలో దక్కించుకుంది. దీంతో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలిచాడు.
2024 ఐపీఎల్ సీజన్‌లో రిషబ్ పంత్ ఆటను గమనిస్తే అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. పంత్ 2023 జనవరి 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలై దాదాపు 15 నెలల తర్వాత క్రికెట్ బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగాడు. ఐపీఎల్ 2024లో 13 మ్యాచ్‌లలో 40.55 సగటుతో మూడు హాఫ్ సెంచరీలతో 446 పరుగులు సాధించాడు.
శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ జట్టు రూ. 26.75 కోట్లకు దక్కించుకుంది. అయ్యర్ గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడాడు. కేకేఆర్ మూడో ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2024 సీజన్ లో శ్రేయాస్ అయ్యర్ 15 మ్యాచ్‌లలో 39.00 సగటుతో 2 హాఫ్ సెంచరీలతో 351 పరుగులు చేశాడు. కేకేఆర్ ఈ సీజన్ లో ఛాంపియన్ గా నిలవడంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లు, కెప్టెన్సీ కీలకంగా ఉన్నాయి.
వెంకటేశ్ అయ్యర్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్ ను ఏకంగా రూ. 23.75 కోట్లకు కోనుగోలు చేసింది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో మూడవ అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలిచాడు. ఐపీఎల్ 2024 ఎడిషన్ లో వెంకటేష్ అయ్యర్ 14 మ్యాచ్‌లలో 46.25 సగటుతో 4 హాఫ్ సెంచరీలతో 370 పరుగులు సాధించాడు.
హెన్రిచ్ క్లాసెన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మాన్ హెన్రిచ్ క్లాసెన్ కూడా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లలో ఓకరు. క్లాసెన్‌ను హైదరాబాద్ టీమ్ వేలంలో 23 కోట్లకు దక్కించుకుంది. ఈ సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐపీఎల్ 2024 సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 39.92 సగటుతో 4 హాఫ్ సెంచరీలతో 479 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ తరఫున ఆడుతున్నాడు. కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లలో ఒకరు. ఆర్‌సీబీ జట్టు అతన్ని రూ. 21 కోట్లతో రిటైన్ చేసుకుంది. కోహ్లీ ఐపీఎల్ 2024లో అద్భుతమైన ఆటతో రికార్డుల మోత మోగించాడు. ఈ సీజన్‌లో కోహ్లీ 15 మ్యాచ్‌లలో 61.75 సగటుతో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 741 పరుగులు సాధించారు.
నికోలస్ పూరన్
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ప్లేయర్లలో ఒకరు. పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.21 కోట్లతో దక్కించుకుంది. నికోలస్ పూరన్ ఐపీఎల్ 2024 సీజన్ లో 14 మ్యాచ్‌లలో 62.37 సగటుతో 3 హాఫ్ సెంచరీలతో 499 పరుగులు సాధించాడు.