
IPL 2025: ధనాధన్ ఇన్నింగ్స్ లు, బుల్లెట్ లా దూసుకువచ్చే ఫాస్ట్ బౌలింగ్.. స్పిన్ మాయాజాలం, ఫీల్డింగ్ లో అద్భుతాలకు సమయం ఆసన్నమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో తమదైన ప్రదర్శనలు ఇవ్వడానికి ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ మెగా క్రికెట్ లీగ్ లో చాలా మంది స్టార్ సీనియర్ ప్లేయర్లు ఆడుతున్నారు. వారి వయస్సును గమనిస్తే వారి కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఐపీఎల్ 2025 తర్వాత వీరు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. ఈ ఐపీఎల్ తర్వాత రిటైర్ అయ్యే టాప్-5 స్టార్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్):
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025లో ఆడుతున్న అత్యధిక వయస్సు కలిగిన లెజెండరీ ప్లేయర్. ధోని ప్రస్తుత వయస్సు 43 ఏళ్లు. అతని వయస్సుతో సంబంధం లేకుండా గ్రౌండ్ లో అదరగొడతాడు. అందుకే అతని ఆటకోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన ధోని.. రాబోయే సీజన్ లో ఘనంగా ముగింపు పలకాలని టార్గెట్ గా పెట్టుకున్నారని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. ఐపీఎల్ 2024 అతనికి చివరి సీజన్ అవుతుందని అందరూ భావించారు కానీ, మరో ఐపీఎల్ సీజన్‌కు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ధోనికి ఐపీఎల్ 2025 చివరి సీజన్ అంటూ పలు రిపోర్టులు పేర్కొన్నాయి.
ఇషాంత్ శర్మ (గుజరాత్ టైటాన్స్):
ఐపీఎల్ వేలంలో భారత స్టార్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2008 వేలం, ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడైన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన తర్వాత, ఇషాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇషాంత్ కోల్‌కతా నైట్ రైడర్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. అతను వచ్చే సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 శర్మకు చివరి సీజన్ అని సమాచారం.
ఫాఫ్ డు ప్లెసిస్ (ఢిల్లీ క్యాపిటల్స్):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తన బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. 40 ఏళ్ల వయసులో డు ప్లెసిస్ టోర్నమెంట్‌లో రెండవ పెద్ద వయసు కలిగిన ఆటగాడిగా ఉన్నాడు. టాప్ ఆర్డర్‌లో ఇప్పటికీ డేంజరస్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. డు ప్లెసిస్ 145 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4,571 పరుగులు చేశాడు. డు ప్లెసిస్ బాగా రాణించలేకపోతే ఐపీఎల్ 2025 అతని చివరి సీజన్ కావచ్చు.
కర్ణ్ శర్మ (ముంబై ఇండియన్స్):
భారత సీనియర్ ప్లేయర్ కర్ణ్ శర్మను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. 37 సంవత్సరాల వయసులో ఐపీఎల్ 2025లో ఆడే ఆరవ పెద్ద వయస్కుడైన కర్ణ్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 84 మ్యాచ్‌లు ఆడి 350 పరుగులు చేసి 76 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో ప్రదర్శన కర్ణ్ శర్మ భవిష్యత్తును నిర్ణయించనుంది. అతను రిటైర్ అయ్యే అవకాశం ఎక్కువని సమాచారం.
మొయిన్ అలీ (కోల్‌కతా నైట్ రైడర్స్):
ఇంగ్లాండ్ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం సిద్ధమయ్యాడు. 37 ఏళ్ల వయసు కలిగిన అతను ఈ టోర్నమెంట్‌లో 5వ పెద్ద వయసు ప్లేయర్ గా ఉన్నాడు. మెగా వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. మొయిన్ అలీ ఏ జట్టు తరఫున ఆడినా మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించే మొయిన్ అలీ మరోసారి తన బెస్ట్ ను ఇవ్వడానిక ఇసిద్ధంగా ఉన్నాడు. తన కెరీర్‌లో 67 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అలీ 1162 పరుగులతో పాటు 35 వికెట్లు కూడా పడగొట్టాడు.