IPL: ఐపీఎల్ 2025లో ఈ బౌలర్లతో బ్యాటర్లకు గుండె ధడేల్ !
IPL 2025 Top 6 Bowlers: ఐపీఎల్ 2025 త్వరలో మొదలు కానుంది. ఈ సీజన్‌లో ఎక్కువ వికెట్లు తీయగల సత్తా ఉన్న ఆరుగురు బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2025 Top 6 Bowlers: ఐపీఎల్ 2025 త్వరలో మొదలు కానుంది. ఈ సీజన్‌లో ఎక్కువ వికెట్లు తీయగల సత్తా ఉన్న ఆరుగురు బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2025: 6 bowlers who will take the most wickets: క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి మొదలవుతుంది. దాదాపు 2 నెలలు జరిగే ఈ టోర్నీ మే 25న ముగుస్తుంది. ధనాధన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లు, కళ్లుచెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు, దడపుట్టించే బౌలింగ్ ప్రదర్శనలు ఇక్కడ చూడవచ్చు. అయితే, రాబోయే ఐపీఎల్ ఎడిషన్ లో సూపర్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లకు దడపుట్టించడమే కాకుండా ఎక్కువ వికెట్లు తీయగల సత్తా ఉన్న ఆరుగురు బౌలర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత ఏడాది కేకేఆర్ ఐపీఎల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 19.14 సగటుతో 21 వికెట్లు తీశాడు. 33 ఏళ్ల ఈ ఆటగాడు గత ఏడాది భారత జట్టులోకి వచ్చాక మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన భారత జట్టులో వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు. గత సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండటం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కలిసొచ్చే అంశం. వరుణ్ చక్రవర్తి నిలకడగా రాణిస్తూ వికెట్లు తీస్తే ఐపీఎల్ 2025లో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్లలో ఒకడిగా ఉండగలడు.
అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ 2025లో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ల రేసులో ఉండటమే కాదు మిగతా బౌలర్లకు గట్టి పోటీ ఇస్తాడు. గత రెండు సీజన్లలో 15కు పైగా వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ పంజాబ్ కింగ్స్‌కు కీలక సమయాల్లో మంచి బౌలర్‌గా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు.
టీ20ల్లో 99 వికెట్లతో భారత్‌లో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలగడం వల్ల బ్యాటర్లకు ప్రమాదకరంగా అర్ష్‌దీప్ సింగ్ మారాడు. అర్ష్‌దీప్ సింగ్ తన ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే ఐపీఎల్ సీజన్‌లో టాప్ బౌలర్లలో ఒకడిగా ఉండగలడు.
రషీద్ ఖాన్:
గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో చూడాల్సిన బౌలర్లలో ఒకడు. 26 ఏళ్ల ఈ ఆటగాడు ఐపీఎల్ 2023లో 27 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే, గత ఏడాది ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌ల్లో కేవలం 10 వికెట్లు మాత్రమే తీశాడు. గుజరాత్ టైటాన్స్ రెండో టైటిల్ గెలవాలని చూస్తుండటంతో, రషీద్ ఖాన్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ప్రభావం చూపుతాడని భావిస్తున్నారు.
రషీద్ ఖాన్ టీ20 క్రికెట్ చరిత్రలో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2024 నుంచి అన్ని టీ20 క్రికెట్ మ్యాచ్‌ల్లో 78 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025లో బాగా ఆడితే రషీద్ ఖాన్ ఈ ఎడిషన్ లో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్లలో ఒకరిగా ఉంటాడు.
యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్‌తో నిలకడగా రాణిస్తూ జట్టుకు మంచి ప్రదర్శనలు ఇచ్చిన యుజ్వేంద్ర చాహల్.. మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ ను వీడి రాబోయే ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడటానికి సిద్ధమయ్యాడు. చాహల్ ఐపీఎల్ చరిత్రలో నిలకడగా రాణిస్తున్న బౌలర్లలో ఒకడు. భారత జట్టు అనుభవజ్ఞుడైన స్పిన్నర్ ఐపీఎల్ లో 160 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్ల మార్కును అందుకున్న ఒకేఒక్క బౌలర్ గా ఘనత సాధించాడు.
గత ఐపీఎల్ సీజన్‌లో యుజ్వేంద్ర చాహల్ 30.33 సగటుతో 18 వికెట్లు తీశాడు. తన బౌలింగ్‌లో వైవిధ్యం చూపుతూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సత్తా ఉన్న ప్లేయర్. 2023 నుంచి చాహల్ భారత జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో, ఐపీఎల్ 2025లో రాణించి భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు మంచి అవకాశం ఉంది.
భువనేశ్వర్ కుమార్
భారత జట్టు సీనియర్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2025లో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ల లిస్టులో తప్పకుండా ఉంటాడు. ఐపీఎల్ 2025 వేలంలో 35 ఏళ్ల ఈ ఆటగాడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గట్టి పోటీ నడిచింది. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే, భువనేశ్వర్ కుమార్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
మతీషా పతిరణ:
చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మతీషా పతిరణ కూడా ఐపీఎల్ 2025లో చూడదగ్గ బౌలర్లలో ఒకరు. 2022లో శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగలా బౌలింగ్ చేసే విధానంతో అదరగొడతాడు. గత రెండు సీజన్లలో పతిరణ భవిష్యత్తులో సీఎస్‌కే పేస్ దళాన్ని నడిపించే సత్తా ఉందని నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ 2024లో ఆరు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. మూడు సీజన్లలో శ్రీలంక పేసర్ 34 వికెట్లు తీశాడు. గాయం లేకుండా సీజన్ మొత్తం బాగా ఆడితే, ఐపీఎల్ 2025లో ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఒకడిగా ఉండగలడు.