Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 ఉమెన్స్ క్రికెట్ ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల తేడాతో గెలిచి భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. స్మృతి మంధాన (79), దీప్తి శర్మ (3/6) సంచలన ఇన్నింగ్స్ తో భారత్ విక్టరీ కొట్టింది.
శ్రీలంకకు చుక్కలు చూపించి ఆసియా గేమ్స్ గోల్డ్ కొట్టిన భారత్
ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ టోర్నీలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. జపాన్‌లో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఏకంగా 147 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌లో స్మృతి మంధాన విధ్వంసక హాఫ్ సెంచరీకి తోడు రిచా ఘోష్ మెరుపులు తోడవడంతో భారత్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేజింగ్‌లో భారత బౌలర్లు దీప్తి శర్మ, షెఫాలీ వర్మ దెబ్బకు శ్రీలంక కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.
25
బ్యాటర్ల విశ్వరూపం: బోర్డుపై 216 రన్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శ్రీలంక బౌలర్లను చెండాడారు. స్మృతి మంధాన 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ ఆఖరిలో రిచా ఘోష్ కేవలం 20 బంతుల్లో 49* పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక టీమ్ స్కోరుగా రికార్డు సృష్టించింది.
35
దీప్తి, శ్రేయాంక మ్యాజిక్: 69 రన్స్ కే లంక ఆలౌట్
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. కెప్టెన్ చమరి (29) కాసేపు పోరాడినా, ఆమెను దీప్తి శర్మ అవుట్ చేయడంతో లంక పతనం ఆగలేదు. భారత స్పిన్నర్ల దెబ్బతో శ్రీలంక మిడిలార్డర్ కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లు ఒకరివెనుక ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 15.4 ఓవర్లలోనే ఆ జట్టు 69 పరుగులకు ఆలౌట్ అయింది. దీప్తి శర్మ 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, శ్రేయాంక పాటిల్, షెఫాలీ వర్మ, శ్రీ చరణి తలా 2 వికెట్లతో లంకను దెబ్బకొట్టారు.
ఈ హిస్టారికల్ విక్టరీతో భారత మహిళల క్రికెట్ జట్టు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
• బిగ్ విక్టరీ: టీ20 క్రికెట్‌లో పరుగుల పరంగా భారత్‌కు ఇది అతిపెద్ద విజయం (147 పరుగులు).
• వరుసగా 8 విజయాలు: పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఇది వరుసగా 8వ విజయం. 2018 నాటి 7 మ్యాచ్‌ల విజయ పరంపర రికార్డును దాటేసింది.
• రెండో గోల్డ్ మెడల్: 2023 ఆసియా గేమ్స్‌లో పసిడి నెగ్గిన భారత్, ఇప్పుడు 2026లో వరుసగా రెండోసారి ఆసియా గేమ్స్ స్వర్ణాన్ని గెలుచుకుంది.
• అత్యధిక సిక్సర్లు: ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఏకంగా 13 సిక్సర్లు బాదారు. ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో భారత్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే.
55
డబుల్ ధమాకా: ఆసియా కప్, ఆసియా గేమ్స్ మనవే
వారం రోజుల క్రితమే ఆసియా కప్ గెలిచిన భారత మహిళల జట్టు, ఇప్పుడు ఆసియా గేమ్స్ గోల్డ్ కూడా గెలుచుకుని ఆసియా ఖండంలో తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. క్వార్టర్స్‌లో జపాన్‌ను, సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను, ఫైనల్లో శ్రీలంకను ఏకపక్షంగా ఓడించిన భారత్ టోర్నీ అంతటా అసలు కాంపిటీషనే లేకుండా ఆధిపత్యం చెలాయించింది. వికెట్ పడగొట్టి విజయముద్ర వేయగానే శ్రేయాంక పాటిల్, సహచర ప్లేయర్లు జాతీయ జెండాతో మైదానంలో సంబరాలు చేసుకున్నారు.