కీలక పర్యటనకు ముందు దక్షిణాఫ్రికా కు భారీ షాక్.. రెండు టెస్టులకు దూరం కానున్న స్టార్ బ్యాట్స్మెన్

First Published Dec 13, 2021, 6:53 PM IST

Quinton de Kock: టీమిండియాతో కీలక పర్యటనకు సిద్ధమవుతున్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది.  మూడు టెస్టు సిరీస్ లో భాగంగా.. ఆ జట్టు వికెట్ కీపర్ రెండు టెస్టులకు దూరం కానున్నాడని సమాచారం. 

అసలే ఆర్థిక ఇబ్బందులు,  ఆటగాళ్లతో కాంట్రాక్టు సమస్యలతో సతమతమవుతున్న  దక్షిణాఫ్రికాకు భారత్ తో పర్యటన కాస్త తెరిపినిచ్చేదే. ఒమిక్రాన్ నేపథ్యంలో ఈ సిరీస్ జరుగుతుందా..? లేదా..? అనేది సందిగ్ధంగా మారినా.. చివరికి క్రికెట్ దక్షిణాఫ్రికా ఎలాగోలా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ఒప్పించగలిగింది.

ఈ మేరకు టెస్టు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. కఠినమైన క్వారంటైన్ నిబంధనలను పాటించడమే గాక పూర్తి స్థాయి బయో బబుల్ లో సిరీస్  నిర్వహిస్తామని  బీసీసీఐకి హామీ ఇచ్చింది. బుధవారం భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. 

అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో సౌతాఫ్రికాకు  భారీ షాక్ తగిలింది. అసలే కీలక ఆటగాళ్లెవరూ లేక.. అనుభవరాహిత్యమున్న జట్టుతో నెట్టుకొస్తున్న దక్షిణాఫ్రికాకు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ భారీ షాకిచ్చాడు. 

డికాక్.. సిరీస్ లోని రెండు, మూడు టెస్టులకు అందుబాటులో ఉండడని తెలుస్తున్నది.  జనవరిలో అతడి భార్య సశా డెలివరీ ఉంది. ఇప్పుడామె నిండు గర్భిణీ. జనవరి లో తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న డికాక్.. సశా దగ్గరికెళ్తే  సిరీస్ లో తర్వాతి టెస్టులకు ఆడటం డౌటే. 

ఈ నేపథ్యంలో ఆ జట్టు కైల్ వెరియెన్, ర్యాన్ రికెల్టన్ లను కూడా వికెట్ కీపింగ్ బాధ్యతల కోసం సిద్ధం చేస్తున్నది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇటీవలే  వెస్టిండీస్  తో ముగిసిన టెస్టు సిరీస్ లో అరంగ్రేటం చేసిన వెరియెన్... మూడు ఇన్నింగ్స్ లలో కలిసి 39 పరుగులే చేశాడు.  దేశవాళీ క్రికెట్ లో కూడా మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి.. ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. 

ఇక మరోవైపు.. రికెల్టన్ దేశవాళీ క్రికెట్ లో అదరగొడుతున్నాడు. ఇంతవరకు అంతర్జాతీయ స్థాయిలో  ఒక్క టెస్టు  మ్యాచ్ కూడా ఆడని అతడు.. ఈ సీజన్ లో ఆడిన చివరి మూడు మ్యాచులలో రెండు సెంచరీలు బాదాడు. మరి ఈ ఇద్దరిలో సెలెక్టర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. 

ఇండియా-సౌతాఫ్రికా టెస్టు సిరీస్ షెడ్యూల్ : 
తొలి టెస్టు : డిసెంబర్ 26-30.. సెంచూరీయన్,  రెండో టెస్టు : జనవరి 3-7.. జోహన్నస్బర్గ్, మూడో టెస్టు : జనవరి 11-15.. కేప్ టౌన్ 

click me!