India vs Oman : ఆసియా కప్ 2025 వరుస విజయాలతో భారత్ గ్రూప్ స్టేజ్ లో మరో మ్యాచ్ మిగిలి వుండగానే సూపర్ 4 దశకు చేరుకుంది. ఇప్పుడు ఒమన్ తో జరగబోయే మ్యాచ్ లో మరో ఘనత సాధించడానికి సిద్ధంగా ఉంది.
ఆసియా కప్ 2025 గ్రూప్-Aలో భారత్-ఒమన్ జట్లు శుక్రవారం అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. ఇది టీమిండియా చరిత్రలో 250వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. దీంతో భారర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ సూపర్-4 దశకు అర్హత సాధించింది. మరోవైపు, రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాన్ని చవిచూసిన ఒమన్ జట్టు టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది. ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికపై ప్రభావం చూపకపోయినా, భారత్ బెంచ్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది.
DID YOU KNOW ?
టీ20 లో 250 మ్యాచ్ లు
T20I లో 250 మ్యాచ్‌లను ఆడిన మొదటి జట్టు పాకిస్తాన్. ఒమన్ తో జరిగే మ్యాచ్ తో భారత్ 250 టీ20 మ్యాచ్ మార్కును అందుకుంటుంది.
25
ఒమన్ పై పరుగుల వర్షం కురుస్తుందా?
ఒమన్ జట్టు ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈలతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. జతిందర్ సింగ్ నేతృత్వంలోని ఈ జట్టు కనీసం చివరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శనలు ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు, భారత్ సూపర్-4 దశకు ముందు కీలక ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
అలాగే, ధనాధన్ ఇన్నింగ్స్ లతో పరుగుల వర్షం కురుస్తుందనే అంచనాలున్నాయి. బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి, అర్షదీప్ సింగ్‌ను ఆడించే అవకాశం ఉంది. అయితే, జట్టు కాంబినేషన్ బలంగా ఉన్నందున పెద్ద మార్పులు చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
35
ఆటగాళ్లు, ఇరు జట్ల గత రికార్డులు
భారత్-ఒమన్ జట్లు ఇప్పటివరకు ఏ ఒక్క అంతర్జాతీయ టీ20లోనూ తలపడలేదు. అయితే, 2024లో జరిగిన ACC ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్ జూనియర్ జట్టు ఒమన్‌ను ఓడించింది. భారత్ గత ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఓటమి చవిచూసింది.
మరోవైపు, ఒమన్ ఐదు వరుస ఓటములతో కష్టాల్లో ఉంది. జతిందర్ సింగ్ గత 10 మ్యాచ్‌ల్లో 302 పరుగులు సాధించగా, ఆమీర్ కలీమ్ 9 వికెట్లు తీశాడు. వీరి ప్రదర్శన ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది.
షేక్ జాయెద్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహకరించడమే కాకుండా బౌలర్లకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 95 టీ20ల్లో, తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 44సార్లు విజయం సాధించగా, రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 51సార్లు గెలిచాయి. అంటే ఛేజింగ్ చేయడం కొంత అనుకూలంగా ఉంటుంది.
వాతావరణ రిపోర్టులు గమనిస్తే.. అబుదాబిలో 37°C నుండి 39°C వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. వర్షం పడే అవకాశం లేకపోయినా, ఆఖరి ఇన్నింగ్స్‌లో డ్యూలో ప్రభావం ఉండే అవకాశం ఉంది.
55
వారికి విశ్రాంతి ఇవ్వండి.. పాక్ తో మ్యాచ్ ముఖ్యం
ఆసియా కప్‌లో ఒమన్ మ్యాచ్‌కు ముందు, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జస్ప్రీత్ బుమ్రాతో సహా స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 28న జరగనున్న కీలక మ్యాచ్‌కు బుమ్రాను తాజాగా ఉంచడం ముఖ్యం అని అన్నారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌తో ప్రయోగాలు చేసి, తిలక్ వర్మ, సంజూ శాంసన్ లకు అవకాశమివ్వాలని సూచించారు. బౌలర్ల కంటే బ్యాటర్లను సిద్ధం చేయడం రాబోయే సూపర్-4 దశలో భారత్‌కు బలాన్నిస్తుందని గవాస్కర్ స్పష్టం చేశారు.