Ind Vs NZ: వైరలవుతున్న టీమిండియా కొత్త సారథి పాత ట్వీట్.. సరిగ్గా తొమ్మిదేండ్ల క్రితం ఇదే గడ్డ మీద..!

First Published Nov 17, 2021, 5:15 PM IST

Rohit Sharma: మరికొద్దిసేపట్లో పొట్టి ఫార్మాట్ లో భారత క్రికెట్ కు కొత్త సారథిగా ఫుల్ టైం బాధ్యతలు చేపట్టనున్న రోహిత్ శర్మ గతంలో చేసిన ఓ ట్వీట్ వైరలవుతున్నది. తొమ్మిదేండ్ల క్రితం అతడు చేసిన ఆ ట్వీట్ ను నెటిజనులు.. ఇప్పుడు పోల్చి చూస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ అనంతరం  పొట్టి ఫార్మాట్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడంతో రోహిత్ శర్మ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. బుధవారం సాయంత్రం జైపూర్ వేదికగా జరుగబోయే టీ20 సిరీస్.. హిట్ మ్యాన్ కు తొలి సవాలు. కోహ్లి గైర్హాజరీలో పలుమార్లు రోహిత్ టీమిండియా సారథిగా బాధ్యతలు నిర్వహించినా పూర్తిస్థాయిలో కెప్టెన్ కావడం ఇదే తొలిసారి. 

ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది.  భారత జట్టులో చోటు కోసం ఇబ్బందులు పడుతున్న  సమయంలో రోహిత్ మహారాష్ట్ర రంజీ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఆ టైంలో రోహిత్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

2012లో రోహిత్.. మహరాష్ట్ర రంజీ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సమయంలో జైపూర్ కు వచ్చిన  హిట్ మ్యాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇప్పుడే జైపూర్ లో అడుగుపెట్టాను. అవును.. ఈ జట్టు (మహారాష్ట్ర)కు నేను సారథ్యం వహించబోతున్నాను.  అదనపు బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను...’ అనేది ఆ ట్వీట్ సారాంశం. 

సరిగ్గా తొమ్మిదేండ్ల తర్వాత.. అదే నవంబర్ నెలలో టీమిండియాకు రోహిత్ పూర్తి స్థాయి  సారథిగా మారడం గమనార్హం. వేదిక కూడా జైపూరే కావడం విశేషం. దీంతో నెటిజనులు.. ఆ ట్వీట్ ను తాజాగా రోహిత్ నియామకాన్ని కలిపి చూస్తున్నారు. 

2007లోనే భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. తొలినాళ్లలో జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. ఫామ్ లేమి, నిర్లక్ష్య బ్యాటింగ్, బద్దకస్తుడు అనే ట్యాగ్ లు అతడి మీద పడ్డాయి.  దాంతో కొన్ని రోజుల పాటు జట్టులో స్థానం దక్కలేదు. 

కానీ  మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని..  రోహిత్ శర్మపై నమ్మకముంచాడు. అప్పటిదాకా మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ ను 2013 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ తో ఓపెనర్ గా పంపించాడు. ఇక అప్పట్నుంచి రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు.

కాగా.. నేటి మ్యాచ్ కు సంబంధించి  మంగళవారం సాయంత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘భారత జట్టు ఈసారి వరల్డ్ కప్ గెలవలేదనేది వాస్తవమే కానీ ఈ ఫార్మాట్ లో చాలా విజయాలు సాధించింది. అయితే జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని పూడ్చాల్సిన అవసరముంది.ఫలానా జట్టులా అవ్వాలని మేం ప్రయత్నించలేదు. మాకంటూ ఓ శైలిని ఏర్పరుచుకుంటాం..’ అని అన్నాడు. 

అంతేగాక జట్టులో కుర్రాళ్లను తీర్చిదిద్దడం చాలా కీలకమైన విషయమన్న రోహిత్..  టీమిండియాకు ఒక నాణ్యమైన ఆల్  రౌండర్ అవసరమన్న మాట వాస్తవమని తెలిపాడు. దానికోసం ముస్తాక్ అలీ టోర్నీ మీద దృష్టి పెట్టాలని అన్నాడు. టీ20లలో విజయాలు సాధించడానికి జట్టుగా ఏం చేయాలో అన్ని చేస్తామని రోహిత్ చెప్పాడు.

click me!