Ind Vs Nz: ఆ రికార్డు బద్దలుకొట్టే మొనగాడు అశ్వినే.. టీమిండియా స్పిన్నర్ పై సంజయ్ బంగర్ ప్రశంసలు

First Published Dec 6, 2021, 11:50 AM IST

India Vs New Zealand: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించడం ఖాయమని భారత మాజీ క్రికెటర్,  ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఇండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో భారత విజయాన్ని శాసించడంలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పాత్ర  కీలకం. ముంబై టెస్టులో అశ్విన్.. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఏకంగా 8 వికెట్లు పడగట్టాడు. 

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్  అశ్విన్ పై ప్రశంసలు కురిపించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును తిరగరాసే సత్తా అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ ఫీట్ కోసం పలువురు  ప్రయత్నిస్తున్నా అందుకు అశ్విన్ అర్హుడని బంగర్ అన్నాడు. 

టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటివరకు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య  మురళీధరన్  పేరటి ఉంది. 133  టెస్టులాడిన మురళీధరన్.. 800 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో తర్వాత స్థానాల్లో షేన్ వార్న్ (708) ఉన్నాడు.

ఆ తర్వాత జేమ్స్ అండర్సన్ (166 టెస్టులలో 619 వికెట్లు) ఉండగా భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (132 టెస్టులలో 619 వికెట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆరో స్థానంలో ఉన్న స్టువర్ట్ బ్రాడ్.. 524 వికెట్లు తీశాడు. 

ఈ జాబితాలో అశ్విన్.. 81 టెస్టుల్లోనే 427 వికెట్లు పడగొట్టి రికార్డుల వైపునకు దూసుకొస్తున్నాడు. అశ్విన్ కంటే బ్రాడ్, అండర్సన్  ముందున్నా వాళ్లు కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కానీ అశ్విన్ కు ఇంకో ఐదారేళ్లు ఆడే సత్తా ఉండటంతో మురళీధరన్ రికార్డు ను అధిగమించడానికి ప్రయత్నించవచ్చు అని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇదే విషయంపై బంగర్ మాట్లాడుతూ.. ‘మురళీధరన్ రికార్డును అశ్విన్ సవాల్ చేయడానికి అతడు అన్ని విధాలా సమర్థుడు. గతంలో కూడా మురళీధరన్ ఓసారి మాట్లాడుతూ.. నా రికార్డులెవరైనా బద్దలు కొడితే అది అశ్వినే అవుతాడని కూడా చెప్పాడు. కావున ఈ ఘనత సాధించడానికి అశ్విన్ కు అన్ని అవకాశాలున్నాయి..’ అని అన్నాడు. 

టెస్టు క్రికెట్ లోనే గాక పరిమిత ఓవర్ల క్రికెట్ లో కూడా  అశ్విన్ బాగా రాణిస్తున్నాడని బంగర్ కొనియాడాడు. నాలుగేండ్ల తర్వాత ఇటీవలే టీ20 లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. అక్కడ కూడా మెరుగ్గా రాణించాడు.  ఇటీవలే ముగిసిన టీమిండియా-న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో అశ్విన్ అదరగొట్టాడు. 

‘అశ్విన్ తన ప్రధాన అస్త్రమైన ఆఫ్ స్పిన్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. టీ20 క్రికెట్ లో కూడా అతడి ప్రదర్శన భాగుంది. కొన్నాళ్లుగా అతడి ప్రదర్శన చూస్తే అతడు అత్యధిక వికెట్ల మైలురాయిని అధిగమిస్తాడని అనిపిస్తున్నది..’అని బంగర్ తెలిపాడు. 

న్యూజిలాండ్ తో ముగిసిన రెండో టెస్టులో ఎనిమిది వికెట్లు తీసిన అశ్విన్..  టెస్టులలో ఈ ఏడాది 50 వికెట్లు తీసిన తొలి   బౌలర్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కివీస్ ఓపెనర్ విల్ యంగ్ ను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ ఫీట్ సాధించాడు.

ఇక ఈ రికార్డును సాధించడం అశ్విన్ కు ఇది నాలుగో సారి. గతంలో కూడా.. 2015 లో (62 వికెట్లు), 2016 లో (72 వికెట్లు), 2017లో (56 వికెట్లు ) ఒక్క క్యాలెండర్ ఈయర్ లో 50 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ అత్యధిక (ఎనిమిది సార్లు) వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు.  

click me!