అక్కడ పోయింది, ఇక్కడ తిరిగి వచ్చేసింది... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మనమే నెం.1...

First Published Dec 6, 2021, 11:39 AM IST

ఐసీసీ టోర్నీల్లో టీమిండియా పర్ఫామెన్స్ ఎలా ఉన్నా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్టుల్లో మాత్రం అద్వితీయమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది భారత జట్టు. వాంఖడే టెస్టులో 372 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని అందుకున్న భారత జట్టు, ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి నెం.1 ర్యాంకును అధిరోహించనుంది...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి, టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది న్యూజిలాండ్... అయితే ఆ పొజిషన్‌ను మళ్లీ ఆరు నెలలకే తిరిగి తెచ్చుకుంది టీమిండియా...

కాన్పూర్ టెస్టులో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని కోల్పోయిన భారత జట్టు, ముంబై టెస్టులో 372 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకోవడంతో టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్ పొజిషన్‌ తిరిగి రానుంది...

టెస్టు కెప్టెన్‌గా 39వ విజయాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ, అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న కెప్టెన్‌గా టాప్ 4లో నిలిచాడు. స్టీవ్ వా 41 విజయాలతో, రికీ పాంటింగ్ 48, గ్రేమ్ స్మిత్ 53 విజయాలతో విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...

స్వదేశంలో 31 టెస్టులకు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీ, 24 మ్యాచుల్లో విజయాలు అందించాడు. రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా, ఐదు టెస్టులను డ్రాలుగా ముగించింది...

ప్లేయర్‌గా 50 టెస్టు విజయాల్లో భాగమైన విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లలోనూ 50+ విజయాల్లో భాగమైన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 50 విజయాలు అందుకున్న విరాట్, వన్డేల్లో 153, టీ20ల్లో 61 విన్నింగ్ మ్యాచుల్లో భాగస్వామిగా ఉన్నాడు...

2021 సీజన్‌లో అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న దేశంగా టాప్‌లో నిలిచింది టీమిండియా. భారత జట్టు ఈ ఏడాది 7 విజయాలు అందుకోగా, పాకిస్తాన్ 6, ఇంగ్లాండ్ 4 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి..

ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత అత్యధిక విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. గ్రేమ్ స్మిత్ 25 సార్లు ఈ ఫీట్ సాధించగా, విరాట్ 23 సార్లు డిక్లేర్ చేసి విజయాలు అందుకున్నాడు. 

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గానూ టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. డబ్ల్యూటీసీ టోర్నీలో విరాట్ 13 విజయాలు అందుకోగా, జో రూట్ 12 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మొత్తంగా 15 విజయాలు అందుకోగా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఆసియా దేశాలన్నీ కలిపి 10 విజయాలే అందుకున్నాయి...

స్వదేశంలో విరాట్ కెప్టెన్సీలో ఆడిన 11 టెస్టు సిరీస్‌లను గెలిచిన టీమిండియా, టెస్టు క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్‌ తేడాతో అతిపెద్ద విజయాన్ని, పరుగుల తేడాతో అతి పెద్ద విజయాన్ని కూడా కోహ్లీ కెప్టెన్సీలోనే దక్కించుకోవడం విశేషం. 

click me!