టీమిండియా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన రాజస్థాన్.. న్యూజిలాండ్ తో సిరీస్ నుంచి మళ్లీ సందడి షురూ.. కానీ ఒక షరతు

First Published Nov 10, 2021, 2:59 PM IST

India Vs New Zealand: క్రికెట్ లో ఎంత పెద్ద  మ్యాచ్ అయినా అది స్టేడియంలో అభిమానులు లేకుంటే మజానే ఉండదు. అభిమానుల కేరింతలు.. సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు వాళ్ల సందడి.. వికెట్ పడ్డప్పుడు వాళ్ల అరుపులు.. ఇవన్నీ ఉంటేనే అసలు మజా..

టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత టీమిండియా మరో వారం రోజుల్లోనే గ్రౌండ్ బాట పట్టనుంది. న్యూజిలాండ్ తో భారత్.. మూడు టీ20లు, రెండు టీ20 లు ఆడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ అభిమానులకు రాజస్థాన్ క్రికెట్ అసోసయేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. 

నవంబర్ 17న  ఇండియా-న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరుగనున్నది. అయితే ఈ మ్యాచుకు ప్రేక్షకులను అనుమతించనున్నట్టు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.  మ్యాచ్ కు ముందు.. కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్డు (48 గంటల ముందుది) ను సమర్పించాల్సి ఉంటుంది. 

మొదటి టీ20కి జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే ఈ  మ్యాచును వీక్షించడానికి వచ్చే అభిమానులు.. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సూచించింది. కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ అయినా వేసుకున్న వారిని  మ్యాచ్ చూడటానికి అనుమతిస్తామని  ఒక ప్రకటనలో తెలిపింది.

కొవిడ్-19 నిబంధనల మేరకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతిస్తామని, దీనిపై రాష్ట్ర హోంశాఖ నుంచి కూడా అనుమతులు తీసుకున్నట్టు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ వివరించింది. 

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో సిరీస్ లో ప్రేక్షకులను అనుమతించారు. ఆ తర్వాత కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు జరుగుతున్నాయి. ఇటీవల యూఏఈలో ముగిసిన ఐపీఎల్ లో కూడా ప్రేక్షకులను అనుమతించలేదు. 

ఇక యూఏఈలోనే జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో కూడా పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. న్యూజిలాండ్ తో భారత్ ఆడబోయే తొలి టీ20కి స్టేడియంలోకి ఎంతమందిని అనుమతిస్తారనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 

కాగా.. న్యూజిలాండ్ తో టీమిండియా నవంబర్ 17న తొలి మ్యాచ్ ఆడనుండగా.. 19న రెండో టీ20 (రాంచీ), 21న ఆఖరు టీ20 (కోల్కతా) ఆడనున్నది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం తుది జట్టును కూడా ప్రకటించింది.

రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు మోస్తున్న జట్టు కింది విధంగా ఉంది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్  కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

click me!