T20 World Cup: దాయాదుల పోరా మజాకా..! రికార్డులు బద్దలవాల్సిందే.. వీక్షణల్లో ఇండియా-పాక్ మ్యాచ్ కొత్త రికార్డు

First Published Nov 9, 2021, 7:42 PM IST

India Vs Pakistan: టీ20 ప్రపంచకప్ లో  భాగంగా ఇటీవలే ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో  టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా.. టీవీ వీక్షణల (వ్యూస్) పరంగా మాత్రం దాయాదుల పోరు కొత్త రికార్డులు సృష్టించింది.

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్థాన్ మధ్య గత నెల 24న హైఓల్జేజీ  మ్యాచ్ జరిగింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కనుమరుగవడంతో.. ఐసీసీ ఈవెంట్లలోనే ఈ జట్ల సమరాన్ని వీక్షించాల్సి వస్తున్నది.

అయితే ఇటీవలే ముగిసిన కీలక మ్యాచ్ లో ఇండియా దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా.. టీవీ వీక్షణల (వ్యూస్) పరంగా మాత్రం దాయాదుల పోరు కొత్త రికార్డులు సృష్టించింది. 

అక్టోబర్ 24న  దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరును.. రికార్డు స్థాయిలో 167 మిలియన్ల (16.70 కోట్లు) మంది వీక్షించారు. ఈ విషయాన్ని స్వయంగా టీ20 ప్రపంచకప్ అఫిషీయల్ బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

పొట్టి క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త రికార్డు కావడం గమనార్హం. టీ20 ఫార్మాట్ లో  అత్యధిక మంది వీక్షించిన అంతర్జాతీయ మ్యాచ్ గా  భారత్-పాకిస్థాన్ పోరు రికార్డులకెక్కింది. 

కాగా.. ఈ మ్యాచ్ కంటే ముందు అత్యధిక మంది చూసిన మ్యాచ్  లో కూడా భారత జట్టే ఉంది. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ పోరును 136 మిలియన్ల (13.6 కోట్లు) మంది చూశారు. ఈ రికార్డు ఇప్పుడు బద్దలైంది.

ఇక ఈ ప్రపంచకప్ లో గతవారం వరకు జరిగిన టీ20  మ్యాచ్ లను 238 మిలియన్ల (23.8 కోట్లు) మంది వీక్షించినట్టు స్టార్ ఇండియా తెలిపింది. ఇందులో క్వాలిఫయర్ మ్యాచ్ లు, సూపర్-12 లోని మొదటి 12 మ్యాచ్ లు ఉన్నట్టు తెలిపింది. 

ఇదిలాఉండగా..  భారీ అంచనాలతో టోర్నీ ప్రారంభించిన టీమిండియా పాకిస్థాన్ పై దారుణ పరాభావాన్ని మూటగట్టకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టీ20, వన్డే వరల్డ్ కప్ లో పాక్ పై ఇప్పటివరకు ఓడని రికార్డున్న భారత్.. ఇటీవల జరిగిన మ్యాచ్ లో  చిత్తుచిత్తుగా ఓడింది. పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.   ఈ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్ పై పోరులోనూ ఓడి.. సెమీస్ కు చేరకుండానే ఇండియాకు పయనమైంది. 

click me!