
India vs Australia 5th T20 : ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించే అద్భుత అవకాశం టీమిండియా ముందు ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న యంగ్ ఇండియన్ టీం టీ20 సీరిస్ ఆడుతోంది... మొత్తం ఐదు మ్యాచుల్లో ఇప్పటికే నాలుగు పూర్తయ్యాయి. సీరిస్ పలితాన్ని నిర్ణయించే ఐదో టీ20 ఇవాళ (నవంబర్ 8, శనివారం) బ్రిస్బెన్ లోని గబ్బా స్టేడియంలో జరగనుంది. భారత్ మంచి దూకుడుమీద ఉంది... ఈ టీ20 లోనూ విజయం సాధించి సీరిస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆసిస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలిచి తీరాలని… తద్వారా సీరిస్ ను సమం చేసి పరువుపోకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఇలా ఇరుజట్లు గబ్బా టీ20 ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అయితే ఇప్పటికే వర్షం కారణంగా ఈ సీరిస్ లో మొదటి టీ20 రద్దయిన విషయం తెలిసిందే.. ఇప్పుడు చివరి టీ20 కి కూడా వర్షం ఆటంకం సృష్టించే అవకాశాలున్నట్లు ఆస్ట్రేలియాలో వాతావరణ పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే టీమిండియా 2-1 తేడాతో సీరిస్ ను కైవసం చేసుకుంటుంది. అంటే వర్షం భారత జట్టుకు ఎలాంటి ఆందోళన కలిగించడంలేదు... ఆసిస్ జట్టుకే ఆందోళన.
టీ20 సీరిస్ పలితాన్ని నిర్ణయించే గబ్బా మ్యాచ్ లో టీమిండియా, ఆసిస్ హోరాహోరీగా పోరాడనున్నాయి... అందుకే ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందా? అనే ప్రశ్నకు వాతావరణ శాఖ నుండి అవుననే సమాధానం వస్తోంది. అభిమానులను నిరాశపరిచేలా ఇవాళ బ్రిస్బేన్‌లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ సూచనలు చెబుతున్నాయి.
బ్రిస్బెన్ వాతావరణ సమాచారం ప్రకారం... ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉంటుందని చెబుతున్నారు. సాయంత్రం 79% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 గంటలకు ప్రారంభం కానుండగా, టాస్ సాయంత్రం 5:45 గంటలకు వేస్తారు. ఇదే సమయంలో వర్షం కురిసే అవకాశాలున్నాయట. ఈ వర్షం ఇండియా, ఆసిస్ మధ్య చివరి టీ20కి ఆటంకం కలిగించవచ్చని.. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే మొదటి టీ20 మాదిరిగా రద్దయ్యే అవకాశాలుంటాయి.
ప్రస్తుతం భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచుల సీరిస్ ల కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అయితే ఆస్ట్రేలియాలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఈ నేపథ్యంలో వన్డే సీరిస్ తో పాటు ఈ టీ20 సీరిస్ కు పదేపదే వర్షాలు అడ్డంకిగా మారాయి. కాన్‌బెర్రాలో వర్షం కారణంగా మనుకా ఓవల్‌లో జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ రద్దయింది. అలాగే పెర్త్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను ఒక్కో జట్టుకు 26 ఓవర్లకు కుదించారు. ఇప్పుడు గబ్బా టీ20కి కూడా వర్షభయం వెంటాడుతోంది. అయితే ఈ మ్యాచ్ అంతరాయం లేకుండా సాగాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి. ఈ టీ20 సీరిస్ ఫలితాన్ని నిర్ణయించే కీలక మ్యాచ్ లో వర్షం కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ గత గురువారం (నవంబర్ 6న) ఆసిస్ పై అద్భుత విజయాన్ని సాధించింది. క్వీన్స్‌లాండ్ కరారా ఓవల్‌లో జరిగిన నాలుగో T20Iలో మిచెల్ మార్ష్ నేతృత్వంలోని ఆసిస్ జట్టును చిత్తుగా ఓడించింది. 48 పరుగుల తేడాతో గెలిచి ఐదు టీ20ల సీరిస్ లో 2-1 తో ఆధిక్యాన్ని సాధించింది.
అంతకుముందు హోబర్ట్ బెల్లెరివ్ ఓవల్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. మొదటి మ్యాచ్ లో ఓటమి తర్వాత పుంజుకుని వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది టీమిండియా. బ్రిస్బెన్ టీ20 లో విజయం సాధించి వారి దేశంలోనే ఆసిస్ ను ఓడించాలని... వన్డే సీరిస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మెన్ ఇన్ బ్లూ చేతిలో సిరీస్ ఓటమిని తప్పించుకోవడానికి చివరి మ్యాచ్‌లో గెలవాలని ఆస్ట్రేలియా కూడా పట్టుదలగా ఉంది.
టీమిండియా ఇంతకుముందు 2012, 2016, 2019, 2021 సంవత్సరాల్లో నాలుగుసార్లు T20I సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించింది. అన్ని సందర్భాల్లోనూ అజేయంగా నిలిచింది. రెండు సిరీస్‌లు గెలిచి, మరో రెండు డ్రా చేసుకుంది. ఇది ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఆధిపత్యాన్ని చూపిస్తుంది. భారత్ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఐదోసారి పర్యటిస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోని తమ అజేయ రికార్డును కొనసాగించాలని చూస్తోంది.
సిరీస్ భారత్‌కు అనుకూలంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ బృందం మరో చారిత్రాత్మక సిరీస్ విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. బ్రిస్బేన్‌లో వర్షం కురుస్తుందని వాతావరణ సూచనలు చెబుతున్న నేపథ్యంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫలితం తేలదు. దీంతో భారత్ 2-1తో సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఆస్ట్రేలియా గడ్డపై T20I సిరీస్‌లలో తమ అజేయ పరంపరను కొనసాగిస్తుంది.