Team India: డ్రీమ్11 కంపెనీ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో, 2025 ఆసియా కప్‌లో భారత జట్టు స్పాన్సర్ లేని జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 కారణంగా డ్రీమ్11 ఈ నిర్ణయం తీసుకుంది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరుగనుంది. ఇది 17వ మెన్స్ టీ20 ఆసియా కప్ టోర్నీ. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 19 మ్యాచ్‌లు జరగనున్నాయి.
అయితే, టీమిండియా జెర్సీ స్పాన్సర్ అయిన డ్రీమ్11 వైదొలగడంతో, వచ్చే నెలలో ప్రారంభం కానున్న 2025 ఆసియా కప్‌లో ప్లేయర్లు ప్రధాన స్పాన్సర్ లోగో లేని జెర్సీలు ధరించి ఆడనున్నారు.
DID YOU KNOW ?
ఆసియా కప్ లో భారత్
ఆసియా కప్ లో భారత్ ఇప్పటివరకు 8 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.
25
డ్రీమ్11 వైదొలగడానికి కారణమేంటి?
గత వారం పార్లమెంట్‌లో ఆమోదం ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన "ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2025" కారణంగా డ్రీమ్11 భారత్ ప్రధాన స్పాన్సర్ నుంచి తప్పుకుంది. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం మనీతో సంబంధం ఉన్న ఆన్ లైన్ గేమ్స్ ను నిర్వహించకూడదు. డ్రీమ్ 11 తమ వెబ్‌సైట్‌లో డబ్బుతో కూడిన ఆన్‌లైన్ గేమింగ్ పోటీలను నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది.
"కొత్త చట్టం కారణంగా, డ్రీమ్11 లేదా అలాంటి ఇతర గేమింగ్ కంపెనీలతో బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించడం కష్టం. అందుకే ఒక అడ్డంకి వచ్చింది. డ్రీమ్11తో ఒప్పందం కొనసాగుతుందని నేను అనుకోవడం లేదు. వేరే మార్గం ఏమైనా ఉందా అని చూస్తున్నాం" అని బీసీసీఐ కార్యదర్శి సైకియా తెలిపారు.
35
కొత్త స్పాన్సర్ కోసం చూస్తున్న బీసీసీఐ
ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా నాయకత్వంలో గురువారం అత్యవసర సమావేశం జరిగింది. కొత్త స్పాన్సర్ కోసం వెతకడం గురించి చర్చించారు. అయితే, దీని కోసం ఎలాంటి గడువును నిర్ణయించలేదు. సెప్టెంబర్ 9న ఆసియా కప్ ప్రారంభం కానున్నందున, అప్పటిలోగా కొత్త స్పాన్సర్ ఒప్పందం కుదరడం కష్టమని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
డ్రీమ్11 కంపెనీ, 2023 జూలైలో, బైజూస్ స్థానంలో టీం ఇండియా ప్రధాన స్పాన్సర్‌గా, మూడు సంవత్సరాలకు 358 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందంలో ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ప్రభుత్వ కొత్త చట్టం కారణంగా డ్రీమ్11 ప్రధాన వ్యాపారానికి ఆటంకం ఏర్పడితే, వారు బీసీసీఐకి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కారణంగా డ్రీమ్11 ఎలాంటి జరిమానా లేకుండా వైదొలిగిందని చెబుతున్నారు.
55
ప్రపంచ కప్ వరకు స్పాన్సర్ దొరుకుతుందా?
బీసీసీఐ రానున్న 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కొత్త స్పాన్సర్ కోసం చూస్తోంది. కానీ, కొత్త చట్టం కారణంగా, పెద్ద కంపెనీలు ఆసక్తి చూపించడం ఆలస్యం కావచ్చు. అందుకే, ఆసియా కప్‌లో భారత ఆటగాళ్ళు స్పాన్సర్ లేని జెర్సీలతో ఆడతారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.