Salman Nizar: 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు. అదే తరహాలో ఇప్పుడు ఏకంగా 12 బంతుల్లో 11 సిక్సర్లు బాది కేరళ ప్లేయర్ సల్మాన్ నిజార్ పరుగుల సునామీ రేపాడు.
12 బంతుల్లో 11 సిక్సర్లు! ఇది నమ్మశక్యం కాదని అనిపించవచ్చు, కానీ నిజంగానే ఇది జరిగింది. ఇది ఏదో చిన్నపాటి మ్యాచ్‌లో కాదు, కేరళ క్రికెట్ లీగ్‌లో జరిగింది. కాలికట్ గ్లోబ్‌స్టర్స్, ఆదానీ త్రివేండ్రం రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది.
యంగ్ ప్లేయర్ సల్మాన్ నిజార్ కేవలం 26 బంతుల్లో 86 పరుగులు సాధించాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో కాలికట్ జట్టు 6 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. తిరువనంతపురంలో సల్మాన్ ఈ రికార్డును నెలకొల్పాడు.
DID YOU KNOW ?
ఒకే ఓవర్ లో 6 సిక్సర్ల రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. 2007 వరల్డ్ కప్‌లో హెర్షెల్ గిబ్స్ (నెదర్లాండ్స్‌పై), 2007 T20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ (ఇంగ్లాండ్‌పై), 2021లో కీరన్ పొలార్డ్ (శ్రీలంకపై) సిక్సర్ల మోత మోగించారు.
26
తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన సల్మాన్
ఆదానీ త్రివేండ్రం రాయల్స్‌పై తొలుత బ్యాటింగ్‌కు దిగిన కాలికట్ గ్లోబ్‌స్టర్స్ తీవ్ర ఒత్తిడిలో పడింది. 18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత సల్మాన్ నిజార్ తన బ్యాటింగ్ విధ్వంసం మొదలుపెట్టాడు.
19వ ఓవర్ వేయడానికి వచ్చిన ఐపీఎల్ ఆటగాడు బాసిల్ థంపిని కూడా సల్మాన్ వదల్లేదు. ఆ ఓవర్‌లో మొదటి ఐదు బంతులకు సల్మాన్ వరుసగా సిక్సర్లు కొట్టాడు. చివరి ఓవర్‌లో తానే స్ట్రైక్ తీసుకోవాలనే ఉద్దేశంతో చివరి బంతికి సింగిల్ తీశాడు. దీంతో బాసిల్ థంపి ఊపిరి పీల్చుకున్నాడని చెప్పవచ్చు.
36
ఒకే ఓవర్ లో 40 పరుగులు కొట్టిన సల్మాన్ నిజార్
సల్మాన్ నిజార్ ఒకే ఓవర్‌లో 40 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. ఆదానీ త్రివేండ్రం రాయల్స్ తరపున చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చిన అభిజిత్ ప్రవీణ్‌పై సల్మాన్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో ఒక వైడ్ బాల్ కారణంగా మరో 4 పరుగులు వచ్చాయి. దీంతో మొత్తం 40 పరుగులు నమోదయ్యాయి. చివరి రెండు ఓవర్లలో మొత్తం 71 పరుగులు వచ్చాయి. సల్మాన్ ధాటికి కాలికట్ గ్లోబ్‌స్టర్స్ భారీ స్కోరు చేసింది. సల్మాన్ ఈ ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఆ జట్టు స్కోరు 130 కూడా దాటేది కాదు.
ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ రికార్డును సల్మాన్ నిజార్ సమం చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో భారత జట్టు తరపున ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు యువరాజ్ సింగ్‌కు ఉంది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ ఈ రికార్డు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రవిశాస్త్రి నిలిచాడు.
దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హెర్షెల్ గిబ్స్, వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌లకు కూడా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సల్మాన్ నిజార్ కూడా అందుకున్నాడు.
56
రంజీల్లోనూ అదరగొట్టిన సల్మాన్
దేశవాళీ క్రికెట్‌లో కూడా సల్మాన్ నిజార్ అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణిస్తున్నాడు. గత సీజన్ రంజీ ట్రోఫీలోని పలు మ్యాచ్‌లలో మంచి బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. కేరళ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్ చేరుకోవడంతో కీలక పాత్ర పోషించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కూడా అతను విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముంబై జట్టుపై 49 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత సీజన్‌లో కేరళ క్రికెట్ లీగ్‌లో 455 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ లీగ్‌లో కొత్త రికార్డు సృష్టించాడు.
66
టీ20 ఫార్మాట్‌కు సరిపోయే ప్లేయర్ సల్మాన్
గత సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దులీప్ ట్రోఫీలో దక్షిణ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జాతీయ సెలెక్టర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.