ఆస్ట్రేలియాకు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన భార‌త్

First Published | Nov 25, 2024, 3:46 PM IST

IND vs AUS :  ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

ఇండియా vs ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా కు భారత్ దిమ్మదిరిగే షాకిచ్చింది. ఈసీస్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ ను దెబ్బకొట్టామని సంబరపడే లోపు మన బౌలర్లు కూడా అద్భుతం చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు సూపర్ బ్యాటింగ్ తో పరుగుల వరద పారించారు. దెబ్బకు భారీ టార్గెట్ చూసి కంగారు టీమ్ కంగారెత్తిపోయింది. దీంతో నాలుగు రోజుల్లోనే భారత్ మ్యాచ్ ను ముగించింది. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్టు మ్యాచ్ లలో తలపడుతున్నాయి. దీనిలో భాగంగా తొలి టెస్ట్ పెర్త్‌ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా ఈ స్కోరును సులభంగా దాటి పెద్ద స్కోరు చేస్తుందని అందరూ భావించారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

కానీ ఆస్ట్రేలియా కూడా వరుసగా వికెట్లు కోల్పోయి 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ విషయంలో ఇరు జట్ల బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కానీ, బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. మొత్తానికి తొలి ఇన్నింగ్స్ ను ఇరు జట్లు ఆడిన తర్వాత భారత్ 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Latest Videos


బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

తొలి  ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పెర్త్ లో పరుగుల వరద పారించారు. సెంచరీల మోత మోగించారు. టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు.  161 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 

అతనికి తోడుగా మరో ఓపెనర్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేెఎల్ రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ 77 పరుగుల తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు బాదాడు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత వరుసగా భారత వికెట్లు పడుతుంటే మరో ఎండ్ నిలదొక్కుకున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ చాలా కాలం తర్వాత సెంచరీ సాధించి అభిమానులను ఉత్సాహపరిచాడు. 100* పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. భారత్ 487 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్ స్కోరుతో భారత జట్టు ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల దాడిని తట్టుకోలేక ఆస్ట్రేలియా ముఖ్య బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్ బాటపట్టారు. దీంతో కంగారు టీమ్ తన రెండో ఇన్నింగ్స్ ను 238/10 పరుగుల వద్ద ముగించి ఓటమిపాలైంది. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

ఆస్ట్రేలియా తరపున ట్రావిస్ హెడ్ 89 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లెవరూ అర్ధ సెంచరీ చేయలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా 238 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగుల తేడాతో (295) గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. అలాగే, ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు (7) సాధించిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు సాధించాడు. 

click me!