Yashasvi Jaiswal run out controversy: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో 175 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు. మాజీ ప్లేయర్లు, అభిమానులు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీ లోని అరుణ్ జేట్లీ స్టేడియం లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు పరుగుల వరద పారించారు. అయితే, ఒక సంఘటన అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఆటతో సెంచరీ పూర్తి చేశాడు. డబుల్ సెంచరీ పక్కా అనుకునే సమయంలో అతను 175 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు.
అయితే, సోషల్ మీడియాలో అభిమానులు శుభ్‌మన్ గిల్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు సైతం గిల్ కారణంగానే జైస్వాల్ రనౌట్ అయ్యాడని పేర్కొన్నారు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జైస్వాల్ తన రనౌట్ పై స్పందించాడు.
25
యశస్వి జైస్వాల్ రనౌట్ ఎలా జరిగింది?
మొదటి రోజు 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన యశస్వి జైస్వాల్ రెండవ రోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనుకున్నాడు. కానీ, మరో రెండు పరుగులు మాత్రమే చేశాడు. జైస్వాల్ జేడన్ సీల్స్ బౌలింగ్ లో ఒక బంతిని మిడ్-ఆఫ్ వైపు ఆడాడు. రన్ కు కాల్ ఇచ్చిన జైస్వాల్ త్వరగా పరుగెత్తగా, మరో ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి తగ్గాడు. గిల్ ఆగిపోవడంతో జైస్వాల్ తిరిగి క్రీజ్ వైపు పరుగెత్తాడు. కానీ అప్పటికే ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్‌కు విసిరాడు. దీంతో జైస్వాల్ 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
ఆ సమయంలో జైస్వాల్ “ఇది నా కాల్” అని గిల్‌కు చెప్పిన మాట వీడియోలో వినిపించడంతో సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. నిరాశగానే అతను క్రీజును వీడాడు.
35
తన రనౌట్ పై యశస్వి జైస్వాల్ ఏమన్నారంటే?
రెండో రోజు ఆట ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన జైస్వాల్ తన రనౌట్ పై స్పందించాడు. “రన్ అవుట్ ఆటలో భాగం. నా ప్రయత్నం ఎప్పుడూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడి, జట్టు లక్ష్యాన్ని సాధించడం. నేను క్రీజ్‌లో ఉన్నప్పుడు ఆటకు వేగం ఇవ్వాలని చూస్తాను. ఒక గంట సేపు క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు రావడం సులభమవుతుందని నా ఆలోచన” అని జైస్వాల్ అన్నాడు.
అలాగే, ఈ రోజు “వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మేము మంచి బౌలింగ్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా వెస్టిండీస్‌ను ఔట్ చేయడం మా లక్ష్యం” అని తెలిపాడు.
ఈ మ్యాచ్ లో భారత ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండో రోజు 5 వికెట్లకు 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత ప్లేయర్లలో యశస్వి జైస్వాల్ 175 పరుగులు, శుభ్‌మన్ గిల్ 129* పరుగులు, సాయి సుదర్శన్ 87 పరుగులతో రాణించారు.
వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. భారత్‌కు 378 పరుగుల ఆధిక్యం ఉంది. స్పిన్నర్లకు పిచ్ బాగా సహకరిస్తోంది. రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశాడు.
55
అత్యధిక వ్యక్తిగత స్కోరుతో రనౌట్ అయిన యశస్వి జైస్వాల్
175 పరుగుల వద్ద రన్ అవుట్ అయిన జైస్వాల్, భారత జట్టుకు అత్యధిక వ్యక్తిగత స్కోరుపై రనౌట్ అయిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. అతని కంటే ముందు 1989లో లాహోర్‌లో సంజయ్ మాంజ్రేకర్ 218 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. 2002లో ఇంగ్లాండ్‌లోని ది ఓవల్ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్ 217 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. 2001లో ద్రావిడ్ మళ్ళీ 180 పరుగుల వద్ద ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రనౌట్ అయ్యాడు. ఇప్పుడు జైస్వాల్ కూడా ఆ జాబితాలో చేరారు.