IND Vs SA: కొంచెం బాధ్యతగా ఆడాలి కదా.. రిషభ్ పంత్ పై సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు

First Published Jan 5, 2022, 4:33 PM IST

India Vs South Africa: ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్న క్రమంలో క్రీజు దాటి ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్న  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్  ఆటతీరుపై విమర్శల వర్షం కురుస్తున్నది. 

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వికెట్లు పడుతున్న సమయంలో  బాధ్యతగా ఆడాల్సింది పోయి చేజేతులా వికెట్ చేజార్చుకోవడంపై టీమిండియా అభిమానులు అతడిపై మండిపడుతున్నారు. 

వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో పంత్ ఔటైన తీరుపై  భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా  విమర్శలు గుప్పించాడు. ఒకవైపు వికెట్లు పడుతుంటే బాధ్యతగా ఆడాల్సింది పోయి అనవసరంగా వికెట్  ఇచ్చేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 

రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా ఆడిన ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే లు అర్థ సెంచరీలు చేసి ఔటయ్యారు. అప్పటికీ భారత ఆధిక్యం వంద పరుగులు మాత్రమే ఉంది. భారత స్కోరు 187 పరుగుల వద్ద ఉంది.  అప్పుడే క్రీజులోకి వచ్చిన పంత్.. ఫ్రంట్ షాట్ ఆడి  కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

దీనిపై గవాస్కర్ స్పందిస్తూ.. ‘ఇద్దరు కొత్త బ్యాటర్లు (రిషభ్ పంత్, హనుమ విహారి ఆడుతుండగా) క్రీజులో ఉన్నప్పుడు పంత్ ఆడిన షాట్ ను చూడండి. అది ఏ మాత్రం క్షమించరానిది. ఇది అతడి సహజ ఆటతీరు కాదు.

ఈ సమయంలో కొంచెం బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. బంతి శరీరంపైకి వస్తున్నప్పుడు  ప్రశాంతంగా ఉండాలి. మీరు రహానే, పుజారాను చూడండి. వాళ్లు పరిపక్వతతో  బ్యాటింగ్ చేశారు...’ అని అన్నాడు. 

ఈ ఇన్నింగ్సులో మూడు బంతులాడిన పంత్.. పరుగులేమీ చేయకుండానే కగిసో రబాడా వేసిన షార్ట్ బంతికి ముందుకొచ్చి ఆడి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 

ఇక గతేడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో సెంచరీ చేసిన తర్వాత పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. గత పన్నెండు ఇన్నింగ్సులలో అతడి స్కోర్లు వరుసగా.. 4, 41, 25, 37, 22, 2, 1, 9, 50, 8, 34, 17 గా ఉన్నాయి. 

ఈ సిరీస్ లో గడిచిన నాలుగు ఇన్నింగ్సులలో 8, 34, 17, 0 గా ఉన్నాయి. దీంతో టీమిండియా ఫ్యాన్స్  పంత్ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టులలో అతడిని తప్పించి  వృద్దిమాన్ సాహాను గానీ, తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ ను గానీ ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.   
 

click me!