క్రికెట్, క్రికెటర్లు బతకాలంటే దానిని వెంటనే రద్దు చేయాలి.. లేకుంటే కష్టం..? కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు

First Published Jan 4, 2022, 4:58 PM IST

Kevin Pietersen: మాయదారి మహమ్మారి కరోనా వివిధ రూపాలను సంతరించుకుంటూ  తన వ్యాప్తిని పెంచుతూ పోతున్నది. ఈ నేపథ్యంలో క్రీడలు, క్రీడాకారులకు బయో బబుల్ లు వాళ్లకు స్వాంతన చేకూర్చడం లేదు. ఇదే విషయమై పీటర్సన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. విశ్వవ్యాప్తంగా క్రీడలు, క్రీడాకారులను భారీగా దెబ్బకొడుతున్నది. సుదీర్ఘ టోర్నీల కోసం ఆటగాళ్లు చాలా కాలం పాటు బయో బబుల్ లో ఉండాల్సి వస్తున్నది. 

ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఇంటి మీద బెంగ, మానసిక సమస్యల కారణంగా సరైన విధంగా  రాణించలేకపోతున్నారు. ఈ విషయంపై గతంలోనే పలుమార్లు స్పందించిన ఇంగ్లాండ్  మాజీ సారథి కెవిన్ పీటర్సన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

కఠినమైన బయో బబుల్స్ వల్ల ఆటగాళ్లు.. ముఖ్యంగా క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న పీటర్సన్.. దానిని వీలైనంత త్వరగా రద్దు చేయాలని కోరాడు. 

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘కఠినమైన బయో బబుల్స్ వల్ల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అనేక కష్టాలు పడుతున్నారు. దానిని తక్షణమే రద్దు చేయాలి.ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా భావిస్తున్న (బయో బబుల్ ను ఉద్దేశిస్తూ) దాని వల్ల ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు...’ అని అతడు ట్వీట్ చేశాడు. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కఠినమైన బయో బబుల్ ఆంక్షల కారణంగా దారుణంగా విఫలమవుతున్నారని కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో పీటర్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

ఆసీస్ లో  ఉన్న ఇంగ్లీష్ ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమై ఉంటున్నారు. దీంతో ఇంగ్లాండ్ ఈ సిరీస్  లోని మిగతా రెండు టెస్టులను రద్దు చేయనుందని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపించాయి. 

ఇదిలాఉండగా.. బయో బబుల్ సమస్యలపై పీటర్సన్ ఒక్కడే కాదు.. గతంలో భారత జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి,  పేసర్ జస్ప్రీత్ బుమ్రా లు కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే వాళ్లు పనిభారంతో పాటు బయో బబుల్ గురించి కొన్ని కామెంట్లు చేశారు. కానీ బబుల్ ను పూర్తిగా రద్దు చేయాలని కోరలేదు. 

కానీ పీటర్సన్ మాత్రం ఏకంగా బయో బబుల్ ను మొత్తంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. మరి దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 

click me!