IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఎందుకు పాకిస్థాన్‌కు వెళ్లకూడదు?

First Published | Sep 1, 2024, 7:59 PM IST

IND vs PAK - champions trophy 2025 : వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఐసీసీ టోర్నీకి భారత్ పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ క్రమంలోనే భారత మాజీ స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

IND vs PAK

మ‌రో మెగా ఐసీసీ టోర్నీ: 

IND vs PAK - champions trophy 2025 : ఇటీవ‌లే టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ఐసీసీ మ‌రో మెగా టోర్నీని నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అదే ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ కోసం భారత్ పాకిస్తాన్ వెళ్తుందా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నగా మిగిలిపోయింది.

ఎందుకంటే చాలా ఏళ్లుగా భార‌త్-పాకిస్తాన్ ల మ‌ధ్య సంబంధాలు పెద్ద‌గా లేవు. భద్రతా కారణాల వల్ల భారత క్రికెట్ జట్టు చాలా కాలంగా పాకిస్తాన్‌లో పర్యటించలేదు. 2012-13 నుంచి భారత్‌, పాకిస్థాన్‌లు ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడలేదు. ఈ రెండు జ‌ట్టు కేవ‌లం ఐసీసీ టోర్నీ మ్యాచ్‌ల్లో మాత్రమే తలపడుతున్నాయి.

భార‌త్ పాకిస్తాన్ ఎందుకు వెళ్ల‌కూడ‌దు? 

భార‌త్ కూడా ఇదివ‌ర‌కు పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ల‌ను ఆడ‌టానికి పాక్ వెళ్లేందుకు ప్ర‌భుత్వాన్ని బీసీసీఐ సంప్ర‌దించ‌గా, స‌ర్కారు నో చెప్పింది. ఆగ‌టాళ్ల‌లో కూడా ప‌లువురు పాక్ వెళ్ల‌డంపై ఆస‌క్తి చూప‌లేదు. క్రీడ‌లు-రాజ‌కీయాల‌ను వేరుగా చూడాల్సిన అవ‌స‌ర‌ముంద‌నే వాద‌న‌లు కూడా చాలా సార్లు వినిపించాయి.

ఈ క్ర‌మంలోనే  ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఎందుకు పాకిస్థాన్‌కు వెళ్లకూడదో ఇప్పుడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. టీమిండియా స్టార్ స్పిన్ బౌల‌ర్ గా జ‌ట్టుకు అనేక విజ‌యాలు అందించిన హ‌ర్భ‌జ‌న్ సింగ్ తాజ‌గా చేసిన ఈ కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. 


హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఏం చేప్పారంటే? 

భద్రతా కారణాల దృష్ట్యా టోర్నీ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఒక ఇంటర్వ్యూలో భ‌జ్జీ మాట్లాడుతూ.. ''వారు ఏమి చెప్పినా. అది సరైనదని వారు భావిస్తారు, అయితే మనం చెప్పేది మన దృక్కోణం. భద్రతాపరమైన సమస్యలు ఎప్పుడూ ఉంటాయని నేను భావిస్తున్నాను.

ఆటగాళ్ల భద్రత అక్కడ నిర్ధారించబడకపోతే, జట్టు అక్కడికి వెళ్లాలని నేను అనుకోను'' అని హ‌ర్భ‌జ‌న్ అన్నాడు. భార‌త‌ బృందాలకు పూర్తి భద్రత ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబితే.. ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ విష‌యంలో క్రికెట‌ర్ల అభిప్రాయాలు కూడా కీల‌కంగా ఉంటాయ‌ని చెప్పారు. 

ఇది కేవ‌లం క్రికెట్ స‌మ‌స్య మాత్ర‌మే కాదు.. 

అలాగే, 'అన్నింటికంటే, ఇది క్రికెట్ సమస్య మాత్రమే కాదు.. సమస్య అంతకు మించి ఉంటుంది. ఒక క్రికెటర్‌గా, మీరు క్రికెట్ ఆడాలనుకుంటే ఆడండి అని నేను చెప్పగలను, అయితే భద్రత గురించి ఎల్లప్పుడూ ఆందోళన ఉంటుంది. భద్రతకు హామీ ఇవ్వకపోతే ఆటగాళ్ళు అక్కడికి వెళ్లకూడదు. ఇది మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది' అని హ‌ర్భ‌జ‌న్ అన్నాడు.

అలాగే, హైబ్రిడ్ మోడల్‌పై చర్చలు జరిగే అవకాశాల‌ను ప్ర‌స్తావించారు. 'ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్లే అవకాశం కనిపించడం లేదు. భారత్‌ పాకిస్థాన్‌లో పర్యటించకుంటే ఐసీసీ ఇప్పటికే ప్లాన్ 'బీ' ని సిద్ధం చేసిందని పలు మీడియా నివేదికల్లో పేర్కొంది.

పాకిస్థాన్‌లో కాకుండా ఇతర వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం దాదాపు 65 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఐసీసీ ఆమోదించినట్లు నివేదికలు తెలిపాయి. గత ఏడాది పాకిస్థాన్‌లో జరిగిన ఆసియా కప్‌లో కూడా భారత జట్టు పాక్ వెళ్ల‌లేదు. భార‌త్ ఆడిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరిగాయి.

పాకిస్తాన్ మాజీ ప్లేయర్ కూడా..

హర్భజన్ సింగ్ తో పాటు పాకిస్తాన్ మాజీ ప్లేయర్ కూడా ఇదే తరహా కామెంట్స్ చేయడం గమనార్హం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు రావద్దనీ, హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని పాకిస్థాన్ మాజీ ఆటగాడు కనేరియా అన్నాడు. భారత జట్టు ఆటగాళ్ల భద్రత ముఖ్యం కాబట్టి ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని అన్నాడు.

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు పాకిస్తాన్‌లో జరుగుతుంది. దీనికి సంబంధించిన ముందస్తు షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించగా, భారత జట్టు ఆడే మ్యాచ్‌లు లాహోర్ స్టేడియంలో జరుగుతాయని వెల్లడించింది. అయితే భారత జట్టు పాకిస్థాన్ వెళ్లి ఆడుతుందా అనే అనుమానాలు  ఉన్నాయి. దాదాపు భారత్ పాక్ వెళ్లే అవకాశాలు మాత్రం లేవని భారత క్రికెట్ వర్గాలు పేర్కొంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.  

Latest Videos

click me!