India vs Pakistan: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపు తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అండగా ఉంటామన్నారు. ఆర్మీని ఆదర్శంగా తీసుకుని మరిన్ని విజయాలు సాధిస్తామని తెలిపారు.
ఆసియా కప్ 2025 : దుబాయ్ లో పాకిస్తాన్ పై భారత్ గెలుపు
దుబాయ్ వేదికగా ఆసియా కప్ 2025లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 6వ మ్యాచ్ లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను పుట్టినరోజు సందర్భంగా మరింత ప్రత్యేకంగా మార్చుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన వ్యాఖ్యలతో పాకిస్తాన్ చెంప చెల్లుమనిపించారు. పాకిస్తాన్ పై గెలుపు తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను, భారత ఆర్మీని గుర్తుచేశారు.
ఈ విజయంతో భారత్ టోర్నమెంట్‌లో బలమైన స్థానం సంపాదించగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ గెలుపుతో పాకిస్తాన్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన సూర్య.. తన వ్యాఖ్యలతో దేశ ప్రజల్లో మరింత గర్వాన్ని నింపారు.
25
అభిమానుల నినాదాల మధ్య కెప్టెన్ సూర్య కామెంట్స్
మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియం అంతా “హ్యాపీ బర్త్‌డే సూర్య” అంటూ మార్మోగింది. ఈ సమయంలో సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “ఈ విజయం నాకు పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్. ఎప్పటి నుంచో చివరి వరకు బ్యాటింగ్ చేయాలని అనుకున్నాను. ఆ బాక్స్‌ను ఇప్పుడు టిక్ చేశాను” అని అన్నారు.
అలాగే, ఈ మ్యాచ్ ను గెలవడంలో జట్టు కలిసికట్టుగా రాణించిందని తెలిపారు. బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను నియంత్రించడం వల్ల గెలుపు సాధ్యమైందని ప్రశంసించారు.
35
ఒత్తిడిని అధిగమిస్తూ భారత్ ను విజయతీరాలకు చేర్చిన సూర్యకుమార్
సూర్యకుమార్ యాదవ్ మరింతగా మాట్లాడుతూ.. “మానవ స్వభావం ఏమిటంటే, ఒత్తిడి మనసులో తిరుగుతూనే ఉంటుంది. కానీ గెలిచిన తర్వాత అది పూర్తిగా పోతుంది. మేము ప్రతి మ్యాచ్‌ను ఒకే రీతిలో తీసుకుంటాము. ఈ మ్యాచ్ ను కూడా అలాగే చూసాము” అని వివరించారు. ఈ వ్యాఖ్యలు జట్టులో ఉన్న ఆత్మవిశ్వాసం, వ్యూహాత్మక ప్రణాళికను ప్రతిబింబించాయి.
సూర్య కుమార్ యాదవ్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. "మేము పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం. మేము మా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. చాలా ధైర్యాన్ని చూపించిన మన సాయుధ దళాలందరికీ ఈరోజు విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నాము. వారు మమ్మల్ని స్ఫూర్తిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాం. వారికి చిరునవ్వు తెచ్చేందుకు ఎప్పుడు అవకాశం వచ్చినా మేము మైదానంలో మరింత కృషి చేస్తాం. భవిష్యత్తులోనూ వారిని గర్వపడేలా చేస్తాం" అని అన్నారు.
55
అభిమానుల ప్రశంసలు, సోషల్ మీడియాలో సూర్య కామెంట్స్ వైరల్
సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో “నిజమైన నాయకుడు” అని ప్రశంసలు వెల్లువెత్తాయి. పుట్టినరోజు సందర్భంగా పాకిస్తాన్‌పై సాధించిన విజయం, దాన్ని సాయుధ దళాలకు అంకితం చేయడం, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అండగా ఉంటామని చెప్పడం.. అభిమానుల గుండెల్లో నిలిచిపోయే క్షణంగా మారింది.
కాగా, ఈ విజయంతో భారత్ ఆసియా కప్ 2025లో మరింత ముందుకు వెళ్లింది. సూపర్ ఫోర్ లో దాదాపు స్థానం ఖాయం చేసుకుంది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం, జట్టు సమష్టి కృషి కలిసి ఈ గెలుపును అందుకున్నారు. ఇకపై కూడా ఇలాంటి ప్రదర్శనలు కొనసాగిస్తామన్న నమ్మకాన్ని సూర్య కామెంట్స్ తో వ్యక్తం చేశారు. మొత్తం మీద, సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ విజయం కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు.. దేశభక్తి, జట్టు సమైక్యత, నాయకత్వానికి ప్రతీకగా నిలిచింది.