ర‌స‌వ‌త్త‌రంగా ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు.. 2 స్థానాల కోసం 5 జ‌ట్ల ఫైట్.. ఛాన్సులు ఇలా ఉన్నాయి..

First Published | May 15, 2024, 10:10 AM IST

IPL 2024 playoffs : లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో ఇంకా ఆ జ‌ట్టు ప్లేఆఫ్ రేసులో ఉంది. ఈ విజ‌యంతో హైద‌రాబాద్, బెంగ‌ళూరు, చెన్నై టీమ్ ల మ‌ధ్య ప్లేఆఫ్ రేసు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. 
 

IPL 2024, IPL

IPL 2024 points table : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేఆఫ్స్ రేసు లీగ్ మ్యాచులు ముగిసే ద‌శ‌కు చేరుకున్న‌కొద్ది ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జ‌రిగిన‌ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో ఐపీఎల్ 2024లో రెండు ప్లే ఆఫ్ స్థానాల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివ‌ర‌కు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (13 మ్యాచుల్లో 19 పాయింట్లు), రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (12 మ్యాచుల్లో 16 పాయింట్లు) అధికారికంగా ప్లేఆఫ్స్ లో చోటుద‌క్కించుకున్నాయి.  మ‌రో రెండు స్థానాల కోసం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. 

లక్నో పై ఢిల్లీ గెలుపుతో  సీఎస్కే, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ల‌కు కాస్త మెరుగైన అవ‌కాశాలు అందించింద‌నే చెప్పాలి. ఎందుకంటే ఎల్ఎస్జీ డీసీని ఓడించి ఉంటే 16 పాయింట్లు సాధించే అవ‌కాశ‌ముండేది కానీ, ఇప్పుడు గరిష్టంగా 14 పాయింట్లకు చేరుకోవచ్చు. ఎల్ఎస్జీ, డీసీలు పేలవమైన రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్ అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులోని జ‌ట్ల ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే.. 

చెన్నై సూపర్ కింగ్స్ - 13 మ్యాచ్ లు - 14 పాయింట్లు (ర‌న్ రేటు +0.528)

మిగిలిన మ్యాచ్లు - 1 (ఆర్సీబీతో..)

రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లేఆఫ్స్ కు మంచి అవకాశం ఉంది. 13 మ్యాచ్ ల్లో 14 పాయింట్లు (ఎన్ ఆర్ ఆర్ +0.528) తో ఉంది. ఆర్సీబీని ఓడిస్తే 16 పాయింట్ల‌కు చేరుకుంటుంది. ఎల్ఎస్జీ తన చివరి మ్యాచ్లో గెలిస్తే (14కు చేరుకుంటే), మరింత మెరుగైన ఎన్ఆర్ఆర్ కారణంగా సీఎస్కే ఇంకా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఎస్ఆర్హెచ్ (12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు) తమ రెండు మ్యాచుల్లోనూ ఓడిపోతే చెన్నై సులువుగానే ప్లేఆఫ్స్ కు చేరుతుంది.


సన్ రైజర్స్ హైదరాబాద్ - 12 మ్యాచ్ ల్లో 14 పాయింట్లు (ర‌న్ రేటు +0.406)

మిగిలిన మ్యాచ్ లు - 2 (గుజ‌రాత్, పంజాబ్ తో)

మిగిలిన రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే హైద‌రాబాద్ ప్లేఆఫ్ స్థానం ఖాయం. ఒక్క మ్యాచ్ లో ఓడినా ప్లేఆఫ్ క‌ష్టాలు పెరుగుతాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ ఓడిపోతే అంతా నెట్ రన్ రేట్ పై అధార‌ప‌డి ఉంటుంది. అలాగే, ఇత‌ర మ్యాచ్ ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే, ఎల్ఎస్జీ, ఆర్సీబీ తమ చివరి మ్యాచ్ల్లో గెలిస్తే ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టు టాప్ 4లో నిలవాలంటే నెట్ ర‌న్ రేటు పై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ సీఎస్కే ఆర్సీబీని ఓడించి, సన్రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచుల్లో ఓడిపోతే ఎల్ఎస్జీ, డీసీల కంటే మెరుగైన రన్ రేట్ను కొనసాగించి చివరి ప్లే ఆఫ్ స్థానాన్ని కైవసం చేసుకోవ‌చ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 13 మ్యాచ్ల్లో 12 పాయింట్లు (నెట్ ర‌న్ రేటు +0.387)

మిగిలిన మ్యాచ్లు - 1 (చెన్నై పై )

వ‌రుస‌గా ఐదు మ్యాచ్ ల విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులోకి వ‌చ్చింది. తొలి ఏడు మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఆ త‌ర్వాత జోరు పెంచింది. ఆర్సీబీ క్వాలిఫై కావాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి 14 పాయింట్లు సాధించాలి. ప్లేఆఫ్స్  నాలుగో స్థానం కోసం పోటీపడుతున్న ఇతర జట్ల కంటే తమ నెట్ ర‌న్ రేటు పెంచుకోవ‌డానికి చూడాలి. ఎస్ఆర్హెచ్ మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి లేదా ఎల్ఎస్జీ తన చివరి మ్యాచ్లో భారీ తేడాతో గెల‌వ‌కుంటే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ కు అవ‌కాశాలు ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ - 14 మ్యాచ్ల్లో 14 పాయింట్లు (నెట్ ర‌న్ రేటు - 0.377)

మిగిలిన మ్యాచ్లు - 0

ఢిల్లీ క్యాపిటల్స్ భవితవ్యం వారి చేతుల్లో లేదు. మిగతా మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. డీసీ క్వాలిఫై కావాలంటే ఎస్ఆర్హెచ్, సీఎస్కే, ఆర్సీబీ, ఎల్ఎస్జీ జట్లు తమ చివరి మ్యాచ్ ల‌లో భారీ తేడాతో ఓడిపోవాలి. అలా జ‌రిగితే 14 పాయింట్లు సాధించిన జట్లు టాప్ 4 లో నిల‌వ‌డానికి నెట్ ర‌న్ రేటు పై ఆధార‌ప‌డ‌గాయి. 

లక్నో సూపర్ జెయింట్స్ - 13 మ్యాచ్ ల్లో 12 పాయింట్లు (ర‌న్ రేటు -0.787)

మిగిలిన మ్యాచ్లు - 1 (ముంబైతో)

ల‌క్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ చాలా దారుణంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. డీసీ చేతిలో ఓటమి తర్వాత మైనస్ 0.787కు పడిపోయింది.  నాలుగో స్థానంపై కన్నేసిన నాలుగు జట్లలో వారి రన్ రేట్ అత్యంత దారుణంగా ఉంది. త‌మ చివ‌రి మ్యాచ్ తో భారీ తేడాతో గెల‌వడంతో పాటు సీఎస్కే, సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు కూడా భారీ తేడాతో ఓడిపోతే ల‌క్నో కు టాప్-4లో చోటుద‌క్కించుకోవ‌డానికి నెట్ ర‌న్ రేటు మెరుగైతే అవ‌కాశాలుంటాయి.

Latest Videos

click me!