ఇండియా లేకుంటే నేను లేను: వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఆసక్తికర వ్యాఖ్యలు.. త్వరలో కొత్త బిజినెస్ లోకి

First Published Dec 7, 2021, 2:44 PM IST

Dwayne Bravo: ప్రపంచ దేశాల్లో భారత్ కు ఉండే  స్థానం ప్రత్యేకం. భారత్ ను ఎంతగా ద్వేషించినా ఒక్కసారి ఇక్కడికొచ్చి  ప్రజలతో కలిసిపోతే ఇక వాళ్లు జీవితంలో ఇండియాను మరువరు. అలా ఇక్కడికొచ్చిన ఎంతో మంది విదేశీయులు.. మనదేశంలోనే స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడే జీవిస్తున్నారు.

క్రికెట్ లో కూడా ఇదేం కొత్త కాదు. నాటి డాన్ బ్రాడ్మన్ నుంచి నేటి ఏబీ డివిలియర్స్ దాకా ఇండియా మీద ప్రేమను పెంచుకున్నవాళ్లే. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అయితే తన కూతురు పేరును ఏకంగా ఇండియానా అని పెట్టుకున్నాడు. గ్రౌండ్ లో భారత ఆటగాళ్లతో హోరాహోరి తలపడినా.. పలువురు ఆసీస్ క్రికెటర్లు కూడా భారతీయుల ప్రేమాభిమానాలకు మురిసినవాళ్లే. ఇక ఆ జాబితాలో మరో వెస్టిండీస్ క్రికెటర్ కూడా చేరాడు. 

వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్  కెరీర్ కు వీడ్కోలు చెప్పిన  డ్వేన్ బ్రావో కూడా.. భారతీయుల ప్రేమకు ఫిదా అయ్యాడు. అసలు ఇండియా లేకుంటే తాను లేనని చెప్పాడు. ఇక్కడి ప్రజలు చూపించే ప్రేమలో స్వచ్ఛత ఉంటుందని, తాను క్రికెట్ ఆడినా, మ్యూజిక్ వీడియోలు రిలీజ్ చేసినా ఆదరించారని చెప్పాడు.

ఇటీవలే ఓ జాతీయ ఛానెల్ తో బ్రావో  మాట్లాడుతూ.. ‘భారత్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇండియా లేకుంటే ఈరోజు నాకున్న విలువలో సగం కూడా ఉండేది కాదేమో. నా దేశం నుంచి ఇండియా ఎంతో దూరాన ఉన్నా ఇక్కడి ప్రజలు మాత్రం నన్ను చాలా అభిమానించారు. వాళ్ల ప్రేమాభిమానాలు నా హృదయాన్ని తాకాయి. 

ఆ ప్రేమతోనే నేను ఇక్కడ క్రికెట్ ఆడినా, మ్యూజిక్ వీడియోల చేసినా  జనం ఆదరించారు..’ అని బ్రావో అన్నాడు. ఇక బయో బబుల్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రతి పనిలో  పాజిటివిటీని వెతికే  వ్యక్తినని తెలిపాడు. ‘ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా చాలా మంది చనిపోతున్నా, మనం మాత్రం బతికే ఉన్నాం. పని చేసుకుంటున్నాం. హాయిగా సంపాదించుకుంటున్నాం. అది హ్యాపీయే కదా.. అయినా ఇది ఎప్పటికీ ఉండదు. త్వరలోనే ముగిసిపోతుంది..’అని బ్రావో చెప్పాడు.

ఇక తాజాగా DJB47 బ్రాండ్ తో ఒక క్లాతింగ్ బ్రాండ్ ను ప్రారంభించబోతున్నాడు. ఇది ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది.  దీనిని వచ్చే ఏడాది ఇండియాలో లాంచ్ చేయనున్నాడు. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా ఈ బ్రాండ్ అందుబాటులో ఉండనుంది. అయితే తాను  సుదీర్ఘకాలంగా ఆడుతున్న చెన్నైలో ఈ షాప్ ను ఓపెన్ చేస్తాడా..? లేక మరేదైనా సిటీని ఎంచుకుంటాడా.?? అన్నది ఆసక్తికరం. 

కాగా.. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై  సూపర్ కింగ్స్.. బ్రావోను రిటైన్ చేసుకోలేదు.  జడేజా, ధోని, రుతురాజ్, మోయిన్ అలీ లను రిటైన్ చేసుకున్న సీఎస్కే.. బ్రావో తో పాటు ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే డూప్లెసిస్ ను కూడా రిటైన్ చేయలేదు. వీరిని త్వరలో జరిగే వేలం ప్రక్రియలో దక్కించుకోవచ్చునని వార్తలు వస్తున్నాయి. 

click me!