న్యూజిలాండ్ కు వరుస షాకులు.. కీలక సిరీస్ లకు కేన్ మామ దూరం.. ఐపీఎల్ లో ఆడతాడా..?

First Published Dec 7, 2021, 2:03 PM IST

Kane Williamson: ఇప్పటికే టీ20 ప్రపంచకప్  ఫైనల్ తో పాటు భారత్ తో టెస్టు,  పొట్టి సిరీస్ లను కోల్పోయిన న్యూజిలాండ్ కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ గాయం కారణంగా కీలక సిరీస్ ల నుంచి తప్పుకున్నాడు. 

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్  కెరీర్ కు భుజం నొప్పి విలన్ లా  మారింది. కొద్దిరోజులుగా  భుజం గాయంతో బాధపడుతున్న  విలియమ్సన్.. తాజాగా రెండు కీలక సిరీస్ ల ముందు విశ్రాంతి తీసుకున్నాడు. 

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ  ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్.. తుది పోరులో ఆసీస్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు రోజులకే భారత పర్యటనకు వచ్చింది.  టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడింది. టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న కేన్ విలియమ్సన్..  సోమవారం ముంబైలో ముగిసిన రెండో టెస్టుకు కూడా దూరంగా ఉన్నాడు. 

గత కొన్నాళ్లుగా భుజం గాయం తరుచూ వేధిస్తుండటంతో పాటు తీరిక లేని క్రికెట్ తో కేన్ మామ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండు నెలల పాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నట్టు న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మంగళవారం తెలిపాడు. 

వచ్చే ఏడాది జనవరిలో బంగ్లాదేశ్.. కివీస్ పర్యటనకు వెళ్లనుంది.  అక్కడ కివీస్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా.. రెండు టెస్టులు ఆడనుంది. ఈ ఏడాది బంగ్లా పర్యటనకు వచ్చిన కివీస్ ను టీ20లలో చిత్తు చేసిన బంగ్లా పులులు.. ఏకంగా సిరీస్ ను కూడా నెగ్గిన విషయం తెలిసిందే. అందుకు బదులు తీర్చుకోవాలని కివీస్ భావిస్తున్నది. 

ఇక బంగ్లా సిరీస్  తర్వాత జనవరి చివరి వారంలో కివీస్ జట్టు.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్నది. అక్కడ మూడు వన్డేలు, ఒక టీ20 ఆడాల్సి ఉంది. బంగ్లా సిరీస్ తో పాటు ఆసీస్  పర్యటనకు కూడా కేన్ మామ దూరంగా ఉండనున్నాడు.. 

అయితే భుజం గాయం వేధిస్తున్నా.. అతడికి  శస్త్ర చికిత్స అవసరం లేదని కోచ్ తెలిపాడు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెడతాడని స్టెడ్ తెలిపాడు. 

ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్నది. ఐపీఎల్ లో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ ను తప్పించిన జట్టు యాజమాన్యం.. కేన్ మామను కెప్టెన్ చేసింది. మరి ఏప్రిల్ వరకైనా విలియమ్సన్ కోలుకుంటాడా..? లేక గాయంతో  టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడా..? అని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

click me!