ఐపీఎల్‌లో పాల్ వాల్తేటి ఆ రికార్డు ఇప్పటికీ సేఫ్... పంజాబ్ కింగ్స్ హీరో ఇప్పుడు ఏమయ్యాడంటే...

First Published Dec 7, 2021, 1:15 PM IST

పాల్ వాల్తేటి... ఐపీఎల్‌ ద్వారా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న దేశవాళీ హీరోల్లో ఒకడు. పంజాబ్ కింగ్స్ తరుపున 2011లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పాల్ వాల్తేటి చేసిన సెంచరీ, ఐపీఎల్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది...

డేవిడ్ వార్నర్‌తో పాటు బ్రెండన్ మెక్‌కల్లమ్, శిఖర్ ధావన్, బుమ్రా, పాండ్యా బ్రదర్స్, వెంకటేశ్ అయ్యర్, నటరాజన్.... ఇలా ఎందరో క్రికెటర్ల కెరీర్‌ను మార్చేసింది ఐపీఎల్. అలా ఐపీఎల్‌లో ఇరగదీసిన ప్లేయర్ పాల్ వాల్తేటి పుట్టినరోజు నేడు.
 

ముంబైలో జన్మించిన పాల్ వాల్తేటి అసలు పేరు పాల్ చంద్రశేఖర్ వాల్తేటి. 2002 ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు వాల్తేటి...

పాల్ వాల్తేటిని ఐపీఎల్ 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. అదే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేసిన వాల్తేటి, అజేయంగా నిలిచి పంజాబ్‌కి ఘన విజయాన్ని అందించాడు...

ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్‌గా పాల్ వాల్తేటి రికార్డు, 10 సీజన్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. 2015లో ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ కూడా 19 ఫోర్లు బాది, పాల్ వాల్తేటి రికార్డును సమం చేసినా... బ్రేక్ చేయలేకపోయాడు...

వాల్తేటి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 189 పరుగుల టార్గెట్‌ను 19.1 ఓవర్లలో ఛేదించింది పంజాబ్ కింగ్స్... ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌ కూడా పాల్ వాల్తేటియే...

2011 సీజన్‌లో మొట్టమొదటి సెంచరీ చేసిన ప్లేయర్ పాల్ వాల్తేటి, ఐపీఎల్ కెరీర్‌లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేశాడు... మొత్తంగా 2011 సీజన్‌లో 463 పరుగులు చేశాడు వాల్తేటి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసిన పాల్ వాల్తేటి... ఆ తర్వాత 2012, 13 సీజన్లలో ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.

వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో ఫెయిల్ అయిన వాల్తేటి... ఫ్యాన్స్‌లో క్రేజ్ కోల్పోయాడు. అన్నింటికీ మించి కెరీర్ ప్రారంభం నుంచి గాయాలతో సతమతమైన వాల్తేటి, ఓ మ్యాచ్‌లో కంటికి గాయం కావడంతో క్రికెట్‌కే పూర్తిగా దూరమయ్యాడు...

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించిన పాల్ వాల్తేటి ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నాడు. ఎయిర్ ఇండియా తరుపున డొమెస్టిక్ టోర్నీలు ఆడుతున్న వాల్తేటి, ముంబైలో కుర్రాళ్లకు క్రికెట్ పాఠాలు నేర్పుతున్నాడు.

click me!