సీనియర్ ఆటగాళ్లతో గొడవకు దిగిన పొలార్డ్..! మీడియాలో సంచలన కథనాలు.. భారత్ తో సిరీస్ కు ముందు విండీస్ కు షాక్

First Published Jan 28, 2022, 3:09 PM IST

India Vs West Indies: ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్న  కరేబియన్ జట్టులో విభేదాలు తలెత్తాయా..? ఆ జట్టు సారథి  కీరన్ పొలార్డ్ కు.. సీనియర్ ఆటగాళ్ళకు మధ్య దూరం  పెరిగిపోతుందా..? అంటే అవుననే అంటున్నది విండీస్ మీడియా..

త్వరలో  భారత పర్యటనకు రానున్న వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్ పై ఆ దేశంలోని స్థానిక మీడియాలో  సంచలన ఆరోపణలు వచ్చాయి.  జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పొలార్డ్.. దారుణంగా వ్యవహరించాడని, పలువురు క్రికెటర్ల మీద వివక్ష చూపుతున్నాడంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు  ప్రసారమయ్యాయి.. 

కరేబియన్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో తలపడుతున్నది.   ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు మ్యాచులు ముగియగా అందులో 2-1  తేడాతో  విండీస్  ఆధిక్యంలో ఉంది.  శని, ఆదివారాల్లో మరో రెండు మ్యాచులు జరగాల్సి ఉంది.

కాగా  విండీస్ జట్టు ఆల్ రౌండర్ ఓడెన్ స్మిత్ తో పాటు మరో ఇద్దరు  సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ పొలార్డ్ వివక్షాపూరితంగా వ్యవహరించాడని  స్థానిక మీడియాతో పాటు సోషల్ మీడియాలో కథనాలు, వాయిస్ మెసేజ్ లు వెలువడుతున్నాయి. 
 

పొలార్డ్ తో పాటు హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ కలిసి ఓడెన్ స్మిత్ ను బలిపశువును చేస్తున్నారని కొన్ని మీడియాలతో పాటు రేడియో జమైకా కూడా కథనాలు ప్రసారం చేసింది. జట్టులో  చీలిక తప్పేలా లేదని కూడా పలు  ఛానెళ్లు  కథనాలు ప్రసారం చేశాయి. 

అయితే దీనిపై విండీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. జట్టులో అంతర్గత పోరు లేదని..  కెప్టెన్ గా అతడి విశ్వసనీయతను శంకించాల్సిన అవసరమే లేదని చెప్పింది.  జట్టులో ఎవరితో ఎవరికీ  వాగ్వాదాలు గానీ, వివక్షా పూరిత వైఖరి లేదని వివరణ ఇచ్చింది.

ఇది తమ జట్టులో విభజనను తీసుకురావడానికి కొంతమంది  చేస్తున్న కుట్రగా  విండీస్  క్రికెట్ బోర్డు అభివర్ణించింది. కెప్టెన్ ను అప్రతిష్టపాలు చేయడంతో పాటు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి కట్టు కథనాలను అల్లుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇదిలాఉండగా.. ఫిబ్రవరి 1న వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రానున్నది.  ఇక్కడ భారత్ తో మూడు వన్డేలు, మూడు  టీ20లు ఆడనున్నది. ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు అహ్మదాబాద్ లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోల్కతా లోని ఈడెన్ గార్డెన్ లో నిర్వహించనున్నారు. 
 

భారత పర్యటనకు విండీస్ జట్టు : కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, బోనర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్,జేసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కీమర్ రోచ్, రొమారియో షెఫర్డ్, ఓడెన్ స్మిత్, హెడెన్ వాల్స్ జూనియర్

click me!