Hardik Pandya: అక్టోబర్ 19న పూణేలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లో ఎడమ చీలమండ గాయం కావడంతో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. అయితే, ఈ భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరం కానున్నాడని సమాచారం.
ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 10 ఆదివారం డర్బన్ వేదికగా తొలి టీ20తో సిరీస్ ప్రారంభం కానుంది.
హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. జనవరి 11 నుంచి 17 వరకు అఫ్గానిస్థాన్ తో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కు అతడు ఫిట్ గా ఉంటాడని భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ లో రోహిత్ శర్మను తిరిగి భారత టీ20 జట్టులోకి రావాలనీ, అతని కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి చేపట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యోచిస్తున్నట్లు గత నివేదిక పేర్కొంది.
ఈ ప్రతిపాదనకు రోహిత్ శర్మ అంగీకరిస్తే 2024లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరిస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.
Suryakumar Yadav
హార్దిక్ తిరిగి వస్తే ఏం జరుగుతుందనే ప్రశ్న ఉందనీ, అయితే టీ20లకు రోహిత్ కెప్టెన్సీ వహిస్తే టీ20 వరల్డ్ కప్ కు కూడా నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ఒకవేళ రోహిత్ ఒప్పుకోకపోతే దక్షిణాఫ్రికాలో జరిగే టీ20లకు సూర్య కెప్టెన్ గా కొనసాగుతాడు.