
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆదివారం సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై ఏకంగా 342 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పురుషుల వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా ఘనత సాధించింది. సౌతాఫ్రికా చెత్త రికార్డును నమోదుచేసింది.
సౌతాఫ్రికాపై 21 ఏళ్ల జాకబ్ బెతెల్ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తన కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. 82 బంతుల్లో 110 పరుగులు చేసి తన బ్యాట్ పవర్ చూపించాడు.
అలాగే, సీనియర్ స్టార్ ప్లేయర్ జో రూట్ 96 బంతుల్లో 100 పరుగులు చేసి 19వ వన్డే సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కి 182 పరుగుల భాగస్వామ్యం చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు.
జేమీ స్మిత్ 62 పరుగులు నాక్ తో ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం అందించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను ముగించాడు. చివరి పది ఓవర్లలో ఇంగ్లాండ్ 115 పరుగులు సాధించింది. సూపర్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ జట్టు 414/5 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జోరు ముందు దక్షిణాఫ్రికా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒత్తిడిలో 19 వైడ్ బంతులు వేశారు.
ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ సౌతాఫ్రికాను కోలుకోని దెబ్బకొట్టాడు. ఆర్చర్ తన పునరాగమన సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 7 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. బ్యాటర్లను ఇబ్బందిపెట్టే సాధారణ వేగంతో అద్భుతమైన లైన్ తో బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఆర్చర్ కు తోడుగా బ్రైడన్ కార్స్ కూడా కీలక వికెట్లు సాధించాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైంది. ఎక్కడా కూడా ప్రభావం చూపలేక చెత్త రికార్డును నమోదుచేసింది. వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో ఓడిపోయిన జట్టుగా సౌతాఫ్రికా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
మంచి ఫామ్ లో ఉన్న కెప్టెన్ టెంబా బవుమా గాయంతో ఆడకపోవడం దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఆరంభంలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 10 ఓవర్లలో 24/6గా నిలిచింది. చివరికి 72 పరుగులకే ఆరంభ 9 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడింది. ఒక్క ప్లేయర్లు పరుగులు చేయడంలో ప్రభావం చూపలేకపోయారు.
ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయినా, చివరి మ్యాచ్‌లో చరిత్ర సృష్టించి మానసిక బలాన్ని పెంచుకుంది. జాకబ్ బెతెల్ వంటి యువ ఆటగాడు ప్రతిభ చాటగా, జో రూట్ అనుభవాన్ని చూపించాడు. జోఫ్రా ఆర్చర్ పూర్తి ఫిట్‌గా తిరిగి రావడం రాబోయే యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టులో మంచి ఉత్సాహం నింపింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జోఫ్రా ఆర్చర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కేశవ్ మహరాజ్ నిలిచారు.