India Vs Pakistan: మీరొస్తానంటే మేమొద్దంటామా..? చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరుకు ఆతిథ్యమిస్తానంటున్న ఎడారి దేశం

First Published Nov 23, 2021, 7:02 PM IST

Dubai Cricket Council: ఇండియా-పాకిస్థాన్  మధ్య  ఏడాదికో.. రెండేండ్లకో ఒక మ్యాచ్ జరిగితేనే ఇరు దేశాల అభిమానులకు పండుగ వచ్చినంత సంబురం. అలాంటిది రెండు దేశాలు గతంలో మాదిరిగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడితే..? ఇక అది వేరే లెవల్.. అయితే ఆ అనుభూతిని తాము కల్పిస్తామంటున్నది ఎడారి దేశం దుబాయ్. 

ప్రపంచ క్రికెట్ లో ఏ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినా రాని మజా  ఇండియా-పాకిస్థాన్ మధ్య వస్తుందనేది జగమెరిగిన సత్యం.  ఇరుదేశాల అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచే ఈ గేమ్  ఎప్పుడెప్పుడా జరుగుతుందా..?అని కోట్లాది మంది వేచిచూస్తుంటారు. ఇటీవల టీ20 ప్రపంచకప్ లో  జరిగిన భారత్-పాక్ మ్యాచ్ వీక్షణల్లో (హాట్ స్టార్, టీవీలలో)  సరికొత్త రికార్డు సృష్టించిందంటే  ఆ క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో కొన్నాళ్లుగా ఈ  ఇరు దేశాల క్రికెట్ వైరాన్ని కేవలం ఐసీసీ టోర్నీలలోనే వీక్షించాల్సి వస్తుంది.  

india vs pakistan toss

అయితే రెండు దేశాల క్రికెట్ బోర్డులు అనుమతులిస్తే తమ దేశంలో ఏడాదికోసారి ఇండియా-పాక్ మ్యాచ్ నిర్వహిస్తామని అంటున్నది దుబాయ్. ఈ మేరకు  దుబాయ్  క్రికెట్ కౌన్సిల్  చిరకాల ప్రత్యర్థులకు ఓ హింట్ కూడా ఇచ్చింది.

ఇదే విషయమై దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్ అబ్దుల్ రెహ్మాన్ ఫలక్నాజ్ మాట్లాడుతూ..  ఇండియా-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించడానికి తాము సిద్దమని ప్రకటించారు.  ఏడాదికొకటైనా లేదంటే రెండైనా సిరీస్ లు నిర్వహించడానికి తమకు అన్ని సౌకర్యాలున్నాయని చెప్పారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియా-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ లు ఇక్కడ (యూఏఈ) లో నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. ఒకప్పుడు  ఈ రెండు దేశాల మధ్య షార్జాలో క్రికెట్ మ్యాచులు జరిగేవి. అవి ఒక యుద్ధంలా ఉండేవి. అది క్రికెట్ వార్. అవి చాలా బాగుండేవి...

నాకింకా గుర్తు.. ఒకసారి ఒక అవార్డుల ప్రధానోత్సవానికి దివంగత బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ ఇక్కడికి వచ్చారు. అప్పుడాయన మాట్లాడుతూ.. షార్జాలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచులు ఆడుతుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవు. క్రికెట్ ప్రజలను కలుపుతుంది. క్రికెట్ మనలను ఒక్కటి చేస్తుంది. ఇది ఇలాగే కొనసాగాలని చెప్పడం నాకింకా గుర్తుంది. 

మేమూ ఇదే కోరుకుంటున్నాం. ఒకవేళ మేము ఇండియాను కన్విన్స్ చేయగలిగితే పాకిస్థాన్ తో ఏడాదికి ఒకటో లేదంటే రెండు సిరీస్ లను ఇక్కడ నిర్వహించుకోవచ్చు..’ అని తెలిపారు.

ఈ రెండు దేశాలు ఆఖరుసారి 2013లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి.  ఆ తర్వాత ఏర్పడిన దేశ రాజకీయ, సరిహద్దు పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మినహా  ఇరు దేశాలు  ముఖాముఖి తలపడటం లేదు. ఇరు జట్లు 2018 ఆసియా కప్ సందర్భంగా దుబాయ్ లో  మ్యాచ్ ఆడాయి.  ఆ తర్వాత  ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో తలపడ్డాయి. 

కాగా.. పాకిస్థాన్ లో 2009లో శ్రీలంక క్రికెటర్ల మీద తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లడానికి  క్రికెట్ ఆడే దేశాలు ఆసక్తి చూపించడం లేదు. దీంతో యూఏఈ.. పాక్ ఆటగాళ్లకు రెండో మాతృదేశం అయింది. గత ఐదారేండ్లుగా ఆ జట్టు ఇక్కడే సిరీస్ లు నిర్వహిస్తున్నది. ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు పాక్ ప్రీమియర్ లీగ్ కూడా ఇక్కడే జరుగుతున్నది. 

ఇక పాక్  క్రికెట్ లీగ్ తో పాటు గత రెండేళ్లుగా  ఐపీఎల్..  ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ నిర్వహణ తో యూఏఈలో కూడా క్రికెట్ పై ఆసక్తి పెరుగుతున్నది. ఇప్పటికే అక్కడ అబుదాబి టీ10 లీగ్ జరుగుతుండగా.. వచ్చే ఫిబ్రవరి నుంచి యూఏఈలో ఎమిరేట్స్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) కూడా ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో మరిన్ని అంతర్జాతీయ సిరీస్ లకు యూఏఈ ని వేదికగా చేయాలని ఎడారి దేశ పాలకులు భావిస్తున్నారు.

అయితే మరి దుబాయ్ ప్రతిపాదనకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఇటీవలే తనను కలిసిన విలేకరులతో గంగూలీ మాట్లాడుతూ.. భారత్-పాక్ సిరీస్ గురించి తాను గానీ, పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా గానీ ఏమీ చేయలేమని అది  ఇరు దేశాల ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.

click me!