ఎమ్మెస్ ధోనీ చెప్పిందే చేశా, టైటిల్ వచ్చేసింది... యంగ్ క్రికెటర్ షారుక్ ఖాన్ కామెంట్స్...

First Published Nov 23, 2021, 6:29 PM IST

కథలన్నీ కంచికే చేరినట్టుగా... క్రికెట్‌లో ఎక్కడ ఎవరేం సాధించినా దాని క్రెడిట్ అటు తిరిగి ఇటు తిరిగి మహేంద్ర సింగ్ ధోనీకి చేరాల్సిందే. ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఫైనల్ హీరో, తమిళనాడు యంగ్ క్రికెటర్ షారుక్ ఖాన్ కూడా ‘అంతా మాహీ వల్లే...’ అంటున్నాడు. 

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌లో తమిళనాడు వర్సెస్ కర్ణాటక జట్లు తలబడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 151 పరుగులు చేయగా, ఆఖరి బంతికి షారుక్ ఖాన్ సిక్సర్ కొట్టడంతో టైటిల్ అందుకుంది తమిళనాడు...

ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో సిక్సర్ బాదిన షారుక్ ఖాన్, 15 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’గా నిలిచాడు...

షారుక్ ఖాన్ క్రీజులోకి వచ్చిన సమయంలో తమిళనాడు విజయానికి 28 బంతుల్లో 57 పరుగులు కావాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. 

 ఆ తర్వాతి ఓవర్‌లోనే వరుసగా ఓ సిక్సర్, ఫోర్ బాదిన షారుక్ ఖాన్, మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా 19వ ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాది, ఆఖరి ఓవర్‌లో లక్ష్యాన్ని తగ్గించగలిగాడు...

ఓ వికెట్ పడిన తర్వాత షారుక్ ఖాన్ సిక్సర్ బాదడంతో తమిళనాడు విజయానికి ఆఖరి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆఖరి బంతికి కళ్లు చెదిరే సిక్సర్ బాది.. మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు. 

‘నేను బ్యాటింగ్‌కి వెళ్లినప్పుడు మా విజయానికి ఇంకా 50-55 పరుగులు కావాలి. నేను కాస్త సమయం తీసుకోవాలని అనుకున్నా. ఆఖరి నాలుగు ఓవర్లు కావడంతో ఫాస్ట్ బౌలర్లే బౌలింగ్ చేస్తారు...

వికెట్లు పడితే, మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. అందుకే ఏది ఏమైనా ఆఖరి దాకా క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నా. ఐపీఎల్ సమయంలో ధోనీ చెప్పిన మాటలు, నాకెంతో ఉపయోగపడ్డాయి...

ఎవరేమనుకున్నా నీపై నీకు నమ్మకం ఉండాలని మాహీ భాయ్ చెప్పారు. ఏది కరెక్టో, ఏది కాదో మనమే నిర్ణయించుకోవాలని అన్నారు, ఎందుకంటే ఆ సమయంలో చేయాల్సింది నిర్ణయించుకోవాల్సింది మనమే...

ఏదైనా తప్పు జరిగితే, దాన్ని స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండమని మాహీ భాయ్ చెప్పారు. ఆఖరి బంతిని ఎదుర్కొనే సమయంలో నా బుర్రలో చాలా ఆలోచనలు తిరిగాయి...

అయితే నేనొక్కటే నిర్ణయించుకున్నా. బాల్ రఫ్‌గా ఉంది, పిచ్ స్లోగా ఉంది. కాబట్టి మిడిల్ చేయగలిగితే సిక్సర్ కొట్టగలుగుతా. అందుకే లాంగ్‌ఆన్ మీదుగా సిక్సర్ కొట్టడానికి వెయిట్ చేశా... రూమ్ రావడంతో స్క్వైయర్ లెగ్‌ మీదుగా సిక్సర్‌గా మలిచా...

మధ్య ఓవర్లలో మేం కొద్దిగా స్లోగా ఆడాం. అదే మా జట్టు ట్రెండ్. ఎవరు ఏం చేయాలనే విషయంలో ప్లేయర్లకు మంచి క్లారిటీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్ బాదడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇది చాలా రోజుల పాటు గుర్తిండిపోతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు షారుక్ ఖాన్...

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన షారుక్ ఖాన్ కొన్ని స్పెషల్ ఇన్నింగ్స్‌లతో క్రికెట్ ఫ్యాన్స్‌ని, విశ్లేషకులను ఆకట్టుకున్నాడు. 11 మ్యాచుల్లో 10 ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసిన షారుక్ ఖాన్‌కి మూడు మ్యాచుల్లో తుది జట్టులో చోటు దక్కలేదు.

click me!