బ్రాడ్ మాన్ రికార్డ్ :
క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు సర్ బ్రాడ్ మాన్. ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతడు ఈ తరానికి తెలియకపోవచ్చు... ముందుతరం క్రికెట్ అభిమానుల్లో ఈ పేరు తెలియవారు ఉండరు. సచిన్ టెండూల్కర్, గంగూలీ లాంటి దిగ్గజాలు సైతం బ్రాడ్ మాన్ ఆటను చూస్తూ పెరిగినవాళ్లే.
ఈ క్రికెట్ దిగ్గజం పేరిట అనేక ప్రపంచ రికార్డులు ఉన్నాయి. ఈ ధనాధన్ క్రికెట్ వచ్చాక కొన్ని రికార్డులు బద్దలయ్యాయి... కానీ 1931 లో అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ను ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎవరు బద్దలుగొట్టలేరు. ఆ టెస్ట్ క్రికెట్ జమానాలోనే టీ20 నే తలదన్నేలా ఆడాడు బ్రాడ్ మాన్. కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ కొట్టడమంటే మామూలు విషయమా.
1931 లో ఆస్ట్రేలియా దేశవాళి క్రికెట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు బ్రాడ్ మాన్. లిత్ గో పాటరీ XI తో జరిగిన మ్యాచ్ లో బ్లాక్‌హీత్ XI తరపున బరిలోకి దిగిన బ్రాడ్ మాన్ సెంచరీతో చెలరేగాడు. ఇప్పట్లా కాకుండా ఆ కాలంలో ఓవర్ కు 8 బంతులు వేయాల్సి ఉండేది. ఇలా 3 ఓవర్లలో అంటే 24 బంతుల్లోనే సెంచరీ బాది సరికొత్త రికార్డు నెలకొల్పాడు బ్రాడ్ మాన్. మాల్థాయిడ్ పిచ్ ఈ అద్భుత ఆటకు వేదికయ్యింది.
క్రీజులోకి అడుగు పెడుతూనూ జూలు విదిల్చాడు బ్రాడ్ మాన్. బ్లాక్ వేసిన మొదటి ఓవర్లో 33 పరుగులు (6,6,4,2,4,4,6,1) రాబట్టాడు బ్రాడ్ మాన్. ఆ తర్వాత ఓవర్లో మరింత రెచ్చిపోయాడు... బేకర్ వేసిన ఈ ఓవర్లో ఏకంగా 40 పరగులు (6,4,4,6,6,4,6,4) రాబట్టాడు. మళ్ళీ బ్లాక్ బౌలింగ్ వేయగా ఇందులో 27 పరుగులు (1,6,6,1,1,4,4,6) చేసారు. ఇందులో రెండు సింగిల్స్ మరో బ్యాట్ మెన్ చేసినవి. ఇలా కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ బాది అరుదైన రికార్డు సాధించాడు బ్రాడ్ మాన్.
ఈ మ్యాచ్ లో ఏకంగా 14 సిక్సర్లు, 29 ఫోర్లలో 256 పరుగులు చేసాడు బ్రాడ్ మాన్. ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాకపోయిన బ్రాడ్ మాన్ ఊచకోత కారణంగా బాగా ప్రాచుర్యం పొందించింది. ఇలాంటి అనేక అద్భుత ఇన్నింగ్స్ బ్రాడ్ మాన్ ఖాతాలో ఉన్నాయి... కానీ ఇదిమాత్రం చాలా ప్రత్యేకం. ఇప్పటికీ ఈ ఇన్నింగ్స్ గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటున్నారంటే ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు.