రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. డిసెంబర్ 18న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మూడో టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 106 టెస్టుల్లో 537 వికెట్లతో అశ్విన్ భారత క్రికెట్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు. అశ్విన్ వన్డేల్లో 156 వికెట్లు, టీ20 క్రికెట్ లో 72 వికెట్లు తీసుకున్నాడు.
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టెస్టులు, వన్డే, టీ20 క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సరే ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడుతూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. వార్నర్ భాయ్ 20,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు ఉన్నాయి.
డీన్ ఎల్గర్
దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్ 2024 ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడుర. టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన ప్లేయర్ గా గుర్తింపు పొందిన ఎల్గర్ 86 టెస్టుల్లో 5000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టుకు అతని నాయకత్వం, క్రీజులో అతని దృఢ సంకల్పం క్రికెట్ చరిత్రలో అతనికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
శిఖర్ ధావన్
టీమిండియా స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ 2024 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డేల్లో 17 కంటే ఎక్కువ సెంచరీలు బాదిన ధావన్.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ కు ధావన్ అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు.
రవీంద్ర జడేజా
భారత గర్వించదగ్గ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకరు. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
విరాట్ కోహ్లీ
క్రికెట్‌లో అద్భుతమైన కెరీర్ ను కలిగిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. భారత్ టీ20 ప్రపంచ కప్ 2024 గెలుచుకున్న తర్వాత పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఫైనల్లో కోహ్లీ చేసిన అజేయ 76 పరుగులు భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాయి.
రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం రోహిత్ వన్డే, టెస్టు క్రికెట్ లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.
జేమ్స్ అండర్సన్
ఇంగ్లాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్ట్ క్రికెట్‌లో 704 వికెట్లు తీసుకున్న అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన పేస్ బౌలర్ గా ఘనత సాధించాడు.
దినేష్ కార్తీక్
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దినేష్ కార్తిక్ 2024లో అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వికెట్ల దగ్గర అద్భుతాలు చేయడంతో పాటు కీలక, అవసరమైన సమయంలో సూపర్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లకు గుర్తింపు పొందిన దినేష్ కార్తిక్.. భారత్ 2007లో టీ20 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
కాలిన్ మున్రో
న్యూజిలాండ్ ఓపెనర్ కాలిన్ మున్రో 2024లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ అయిన మున్రో న్యూజిలాండ్ తరపున టీ20, వన్డే క్రికెట్ లో ఆడాడు.
హెన్రిచ్ క్లాసెన్
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ హెన్రిచ్ క్లాసెన్ 2024 ప్రారంభంలో తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. కొన్ని టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన క్లాసెన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఫోకస్ చేస్తున్నాడు. వన్డేలు, టీ20లలో సౌతాఫ్రికాకు అద్భుతమైన ఇన్నింగ్స్ విజయాలు అందించాడు.