SRH HCA controversy: ఎస్ఆర్హెచ్ టికెట్ల వివాదం..హెచ్‌సీఏ హెడ్ జగన్ మోహన్ రావు అరెస్ట్‌.. అసలు ఏం జరిగింది?

Published : Jul 09, 2025, 11:00 PM IST

SRH HCA controversy: ఐపీఎల్ టికెట్ల కుంభకోణంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు‌ను సీఐడి అరెస్ట్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభంతో ఇది జరిగింది.  అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అవకతవకలతో రంగంలోకి సీఐడి

SRH HCA controversy: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు ఎ. జగన్ మోహన్ రావును తెలంగాణ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడి) అధికారులు బుధవారం (జూలై 9న) అరెస్ట్ చేశారు. ఇది  ఐపీఎల్ 2025 సీజన్‌లో టికెట్ల కేటాయింపులో జరిగిన తీవ్రమైన అవకతవకలపై రాష్ట్ర విజిలెన్స్ శాఖ నివేదికను పరిశీలించిన తర్వాత తీసుకున్న చర్యలో భాగంగా ఉంది.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ నెలల పాటు పరిశీలించి, హెచ్‌సీఏ పై, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై తీవ్రమైన ఆరోపణలను ధృవీకరించింది. ఇందులో ఐపీఎల్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ (ఎస్ఆర్హెచ్) మ్యాచ్ టికెట్ల కోసం ఒత్తిడి, బెదిరింపులు, అవినీతి చర్యలు, బ్లాక్‌మెయిలింగ్ వంటి అంశాలు ఉన్నాయి.

26
ఎస్ఆర్హెచ్ - హెచ్‌సీఏ వివాదం ఎక్కడ మొదలైంది?

ఈ వివాదం ఐపీఎల్ 2025 సమయంలో హైదరాబాద్‌లో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌ల సమయంలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ టి.బి. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. హెచ్‌సీఏ అధికారులు  అదనంగా ఉచిత టికెట్లు కోరారని ఆరోపించారు. బెదిరింపులు, వేధింపుల విషయాలు ప్రస్తావించారు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఎస్ఆర్హెచ్ (SRH) ఇప్పటికే స్టేడియంలోని 10 శాతం టికెట్లను (3,900 టికెట్లు) హెచ్‌సీఏ కు ఉచితంగా కేటాయిస్తుంది. అయితే, హెచ్‌సీఏ కార్యదర్శి మరో 10 శాతం టికెట్లను అదనంగా కోరారనీ, అలాగే అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తన వ్యక్తిగతంగా కూడా 10 శాతం టికెట్లను డిమాండ్ చేశారని ఎస్ఆర్హెచ్ వర్గాలు ఆరోపించాయి.

36
మ్యాచ్ సమయంలో అడ్డంకులు, వీఐపీ గ్యాలరీలకు లాక్‌

2025 మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా, హెచ్‌సీఏ అధికారులు వీఐపీ గ్యాలరీలను తాళం వేశారు. ఇది హైదరాబాద్ టీమ్ యాజమాన్యం నిరసనకు కారణమైంది. సదరు వీఐపీ బాక్స్ (F3), లక్నో యజమాని సంజీవ్ గోయెంకాకు కేటాయించినదిగా ఎస్ఆర్హెచ్ తెలిపింది.

ఈ ఘటనలపై ఎస్ఆర్హెచ్ తీవ్రంగా స్పందిస్తూ హెచ్‌సీఏ టికెట్ల పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తోందనీ, భవిష్యత్‌లో హైదరాబాద్‌ నుంచి ఐపీఎల్ మ్యాచులు తరలించవచ్చనే విషయాలను ప్రస్తావించింది. తమ హోం గ్రౌండ్ ను మరో చోటుకు మారుస్తామని హెచ్చరించింది.

46
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విజిలెన్స్ విచారణ

ఎస్ఆర్హెచ్ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కోత్తకోట శ్రీనివాస్ రెడ్డికి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు.

విజిలెన్స్ నివేదికలో హెచ్‌సీఏ అధ్యక్షుడు సహా ఇతర అధికారులపై తీవ్రమైన ఆరోపణలు నమోదు అయ్యాయి. టికెట్లను బ్లాక్‌మార్కెట్‌లో అమ్మడం, ఆర్ధిక కుంభకోణాలు, అక్రమంగా సంఘం ఖాతాల్లోని నిధులను విత్‌డ్రా చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.

56
హెచ్‌సీఏ అధికారుల అరెస్టులు, రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో పాటు కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ సి.జె. శ్రీనివాస్, సీఈఓ సునీల్ కాంటేలు కూడా అరెస్ట్‌ అయ్యారు. వీరిపై సన్‌రైజర్స్ హైదరాబాద్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున వచ్చిన ఫిర్యాదులపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.

ఈ కేసులను పర్యవేక్షిస్తున్న సీఐడి ఎస్పీ శ్రీనివాస్, అదనపు ఎస్పీ మోహన్ రాజా ఆధ్వర్యంలో పలు బృందాలతో ఏకకాలంలో చర్యలు తీసుకొని అరెస్టులు చేశారు.

66
అప్పట్లో హెచ్‌సీఏ ఏం చెప్పింది?

ఈ ఆరోపణలపై హెచ్‌సీఏ అప్పట్లో స్పందిస్తూ, ఎలాంటి అధికారిక ఈమెయిల్స్ తమకు అందలేదని, ఇదంతా తమ ప్రతిష్టను దిగజార్చేందుకు చేసిన తప్పుడు ప్రచారం అని పేర్కొంది. అయితే, మీడియాకు లీకైన ఎస్ఆర్హెచ్ ఈమెయిల్‌లో, హెచ్‌సీఏ అధ్యక్షుడు అదనపు టికెట్లు కోరుతూ బెదిరింపులకు పాల్పడ్డారనే విషయాలు వివరించింది.

తాజా అరెస్టులతో పాటు విజిలెన్స్ నివేదికను ప్రాతిపదికగా తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హెచ్‌సీఏ లోని పాలనా లోపాలు, వ్యవస్థాపిత అవినీతిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో కూడా హెచ్‌సీఏ పై అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ సమయంలో టికెట్ల అక్రమ అమ్మకాల ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం జగన్ మోహన్ రావు అరెస్ట్‌తో ఈ వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. రానున్న రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌కు వేదికయ్యే అవకాశాలపై ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories