37 ఏళ్ల ఛెతేశ్వర్ పుజారా 2023 జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత భారత్ తరపున ఆడలేదు. అప్పటి నుంచి అతన్ని సెలెక్టర్లు పట్టించుకోకపోవడమే అతని రిటైర్మెంట్ నిర్ణయానికి ప్రధాన కారణమైంది.
బీసీసీఐ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, 2025 ఆస్ట్రేలియా పర్యటనలో కూడా పుజారా కాకుండా తక్కువ అనుభవం ఉన్న క్రికెటర్లను ఎంపిక చేశారు. అలాగే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో, పుజారాకు తిరిగి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
దేశవాళీ క్రికెట్‌లో ముఖ్యంగా రంజీ ట్రోఫీ, కౌంటీ క్రికెట్‌లో పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా, జాతీయ జట్టులో స్థానం మాత్రం దక్కలేదు. తన రిటైర్మెంట్ ప్రకటనలో పుజారా నేరుగా సెలక్షన్ సమస్యను ప్రస్తావించకపోయినా.. “అన్ని మంచి విషయాలు ఒక రోజు ముగియాల్సిందే” అని పేర్కొనడం గమనార్హం.
భారత టెస్టు జట్టులో నయా వాల్ గా గుర్తింపు పొందిన పుజారా రిటైర్మెంట్ తో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ తర్వాత టెస్టు జట్టులో పుజారా ఆ లోటును పూడ్చిన ఆటగాడు. అయితే పుజారా స్థానం భర్తీ చేయడం ప్రస్తుత యువ ఆటగాళ్లకు సవాల్ అని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.