క్రికెట్ అంటేనే అద్భుతాలు. ఒక్క బాల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. టీ20 హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా టెస్ట్ మ్యాచ్‌లను క్రికెట్ లవర్స్ ఆస్వాదిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ అసలైన టెస్ట్ మ్యాచ్ మజాను చూపించింది.
జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు వేగం ముందు నిలువలేకపోయిన విండీస్ కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
25
15 బంతుల్లోనే 5 వికెట్లు
ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్, కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసి కొత్త రికార్డు సృష్టించాడు. ఇలా వేగంగా 5 వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియన్ బౌలర్‌గా నిలిచాడు. అదే సమయంలో అతను తన టెస్ట్ కెరీర్‌లో 400 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాకి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
35
స్కాట్ బోలండ్ హ్యాట్రిక్
మరోవైపు స్కాట్ బోలండ్ తన బౌలింగ్‌తో హ్యాట్రిక్ సాధించాడు. జస్టిన్ గ్రేవ్స్, షమర్ జోసెఫ్, జోమెల్ వారికన్‌లను వరుసగా ఔట్ చేసి హ్యాట్రిక్ వికెట్లు తీసిన బోలండ్ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు 1955లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను 26 పరుగులకు ఆలౌట్ చేసినప్పుడు నమోదయ్యింది. ప్రస్తుతం విండీస్ చేసిన 27 పరుగులు రెండో అత్యల్ప స్కోరుగా నమోదైంది. విండీస్ జట్టు కేవలం 14.3 ఓవర్లలోనే ఆలౌట్ కావడం ఘోర పరాజయానికి నిదర్శనం.
55
డకౌట్ల పరంపర
విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఏడు మంది డక్ అవుట్ అయ్యారు. స్టార్క్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి విండీస్‌ను కుదేలు చేశాడు. చివర్లో జేడెన్ సీల్స్‌ను ఔట్ చేసిన స్టార్క్ ఆ మ్యాచ్‌ను ముగించాడు. దీంతో మొత్తం కొన్ని గంటల వ్యవధిలోనే ముగిసింది.