ప్రస్తుతం అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్నారు. అభిషేక్ శర్మ గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ లో మంచి ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చాడు. టీ20ల్లో తన దూకుడైన బ్యాటింగ్‌తో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జట్టుకు త్వరగా పరుగులు సాధించడంలో సహాయపడుతుంది. శర్మ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత 17 టీ20లలో 193.85 స్ట్రైక్ రేట్‌తో 535 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
యశస్వి జైస్వాల్ విషయానికి వస్తే టెస్టులతో పాటు టీ20ల్లో తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్ లో అద్భుతమైన రికార్డులను కలిగి ఉన్నాడు. టీ20లలో కూడా జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 23 టీ20 మ్యాచ్‌లలో 164.32 స్ట్రైక్ రేట్‌తో 723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
యశస్వి జైస్వాల్ మూడు ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణిస్తుండగా, అభిషేక్ శర్మ ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో తన బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్నాడు. భారత జట్టు జైస్వాల్ ను కాదని అభిషేక్ శర్మ వైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణాలు చూస్తే.. అద్భుతమైన స్ట్రైక్ రేటు, అలాగే, బౌలింగ్ కూడా చేయగల సత్తా కలిగి ఉండటం. ఇది జట్టుకు ఒక అదనపు ప్రయోజనంగా భావించి బీసీసీఐ అభిషేక్ శర్మను జట్టులోకి తీసుకుంది.