Abhishek Sharma : సిక్సర్ల కింగ్ అభిషేక్.. శర్మ మరో సెంచరీ రికార్డు కొట్టాడు !

Published : Apr 02, 2026, 11:17 PM IST

Abhishek Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ దంచికొట్టాడు. కేకేఆర్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శర్మ.. ఎస్‌ఆర్‌హెచ్ తరపున 100 సిక్సర్లు పూర్తి చేశాడు. 

PREV
15
ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఆరో మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈడెన్ గార్డెన్స్ పిచ్ ప్రారంభంలో బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. దీనిని పూర్తిస్థాయిలో అనుకూలంగా మార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్లు క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించారు.

25
హెడ్ - అభిషేక్ జోడీ ఊచకోత

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడుగా ప్రారంభించారు. ఈ ఓపెనింగ్ జోడీ కేకేఆర్ బౌలర్లను ఏమాత్రం కనికరించకుండా మైదానం నలుమూలలా బాదారు. కేవలం 34 బంతుల్లోనే వీరిద్దరూ మొదటి వికెట్‌కు 82 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ట్రావిస్ హెడ్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 21 బంతుల్లో 46 పరుగులు చేశారు. ఇందులో 6 ఫోర్లు, 3 అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు అభిషేక్ శర్మ కూడా అదే వేగంతో 21 బంతుల్లో 48 పరుగులు సాధించారు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. వీరిద్దరి ధాటికి ఈడెన్ గార్డెన్స్ మైదానం ఫోర్లు, సిక్సర్ల మోతతో హోరెత్తిపోయింది.

35
అభిషేక్ శర్మ సిక్సర్ల సెంచరీ రికార్డు

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో అవుట్ అయినప్పటికీ, ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ మ్యాచ్‌తో ఆయన తన సిక్సర్ల సంఖ్యను 101కి పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన కంటే ముందు కేవలం డేవిడ్ వార్నర్ (143 సిక్సర్లు) మాత్రమే ఉన్నారు.

45
ఎస్‌ఆర్‌హెచ్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే
  1. డేవిడ్ వార్నర్ - 143
  2. అభిషేక్ శర్మ - 101
  3. హెన్రిచ్ క్లాసెన్ - 90
  4. కేన్ విలియమ్సన్ - 64
  5. ట్రావిస్ హెడ్ - 50
55
కార్తీక్ త్యాగి మ్యాజిక్.. బ్రేక్ త్రూ

హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్న తరుణంలో, ఆరో ఓవర్లో కేకేఆర్ బౌలర్ కార్తీక్ త్యాగి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 142.2 కిలోమీటర్ల వేగంతో త్యాగి వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో ట్రావిస్ హెడ్ తడబడ్డారు. బంతి బ్యాట్ కింది భాగంలో తగిలి గాలిలోకి లేవగా, మిడ్-ఆన్‌ వద్ద ఉన్న కామెరాన్ గ్రీన్ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నారు. హెడ్ అవుట్ కావడంతో స్టేడియంలోని కేకేఆర్ అభిమానుల కేరింతలతో ఈడెన్ గార్డెన్స్ దద్దరిల్లిపోయింది.

ముజరబానీ డబుల్ స్ట్రోక్

హెడ్ నిష్క్రమణ తర్వాత ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ తొమ్మిదో ఓవర్లో జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ డబుల్ షాక్ ఇచ్చారు. మొదట ఇషాన్ కిషన్ (14)ను రింకూ సింగ్ చేతికి చిక్కేలా చేసి అవుట్ చేశారు. ఆ తర్వాత అదే ఓవర్ నాలుగో బంతికి ప్రమాదకరంగా మారుతున్న అభిషేక్ శర్మను పెవిలియన్ పంపారు. ముజరబానీ వేసిన స్లో బౌన్సర్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన అభిషేక్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడారు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న వరుణ్ చక్రవర్తి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అభిషేక్ ఇన్నింగ్స్ 48 పరుగుల వద్ద ముగిసింది. అభిషేక్, హెడ్, క్లాసెన్ సూపర్ నాక్ లతో భారీగా పరుగులు చేసిన హైదరాబాద్ టీమ్.. బౌలింగ్ లోనూ సత్తా చాటింది. దీంతో 65 పరుగుల తేడాతో కేకేఆర్ పై విజయం సాధించింది.

Read more Photos on
click me!

Recommended Stories