ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.

Published : May 17, 2026, 08:08 PM IST

Water Fuel Technology: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, ముడి చమురు సంక్షోభం మధ్య ఓ కొత్త టెక్నాలజీ చర్చనీయాంశంగా మారింది. ఓ విదేశీ సంస్థ నీటి సహాయంతో ఇంధన వినియోగాన్ని తగ్గించే ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది.

PREV
15
నీటితో ఇంధన వినియోగం తగ్గుతుందా?

ఈ టెక్నాలజీ పేరు “కావిటెక్ ఫ్యూయల్ ఎమల్షన్”. ఇందులో ఇంధనంతో పాటు నీటిని ప్రత్యేక విధానంలో కలుపుతారు. సాధారణంగా నీరు, ఇంధనం కలవవు. కానీ ప్రత్యేక టెక్నిక్‌తో వాటిని మైక్రో స్థాయిలో మిళితం చేస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా వాహనాలు, భారీ పరిశ్రమల యంత్రాలు తక్కువ ఇంధనంతో ఎక్కువ సామర్థ్యంతో పనిచేయగలవని కంపెనీ చెబుతోంది. ఇలా తయారైన ఇంధనం దహనం సమయంలో చిన్న చిన్న “మైక్రో ఎక్స్‌ప్లోజన్స్” సృష్టిస్తుంది. దీని వల్ల ఇంధనం పూర్తిగా కాలిపోతుంది. ఫలితంగా తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుందని కంపెనీ చెబుతోంది.

25
ఇంజిన్‌లో మార్పులు అవసరం లేదంటున్న కంపెనీ

ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే, వాహనం లేదా యంత్రంలోని ఇంజిన్‌ను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యంత్రాల్లోనే ఈ విధానాన్ని అమలు చేయవచ్చని పేర్కొంది. అంతేకాకుండా పరిశ్రమల్లో యంత్రాలను ఆపకుండా కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించవచ్చని వెల్లడించింది. దీనివల్ల కంపెనీలకు అదనపు నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

35
ఇంధన ఆదాతో పాటు కాలుష్యం కూడా..

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ టెక్నాలజీ వల్ల బాయిలర్లు, సముద్ర నౌకల ఇంజిన్‌లలో 6 నుంచి 10 శాతం వరకు ఇంధన ఆదా సాధ్యమైందని చెబుతున్నారు. భారత్‌లోని కొన్ని రిఫైనరీలు, ఉక్కు పరిశ్రమల్లో నిర్వహించిన పరీక్షల్లో కూడా 3.6 నుంచి 6 శాతం వరకు ఇంధన వినియోగం తగ్గినట్లు గుర్తించారని సమాచారం. ఇది కేవలం ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించగలదని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా NOx, SOx వంటి హానికర వాయువుల ఉద్గారాలను 40 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది.

45
ఇప్పటికీ ప్రయోగ దశలోనే..

ఈ సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఇది సాధారణ కార్లు లేదా బైక్‌లలో విస్తృతంగా ఉపయోగంలోకి రాలేదు. ప్రస్తుతం పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, నౌకాయాన రంగాల్లో మాత్రమే పరీక్షలు కొనసాగుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ టెక్నాలజీ పెద్ద స్థాయిలో విజయవంతమైతే భవిష్యత్తులో ఇంధన రంగంలో భారీ మార్పులు రావచ్చు. ముఖ్యంగా భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ఉపశమనం కలిగించే అవకాశముందని భావిస్తున్నారు.

55
భారత్‌కు ఎంతో అవ‌స‌రం

భారత్ ప్రస్తుతం అవసరమైన ముడి చమురులో దాదాపు 88 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతోంది. ఇలాంటి సమయంలో ఇంధన వినియోగాన్ని తగ్గించే కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తే దేశానికి విదేశీ మారక ద్రవ్య భారం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఇంధన పొదుపు టెక్నాలజీలపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories