Iran US Conflict : ఇరాన్‌పై సైనిక దాడిని ట్రంప్ వాయిదా వేయడంతో గ్లోబల్ మార్కెట్లు కోలుకున్నాయి. ముడి చమురు ధరలు పతనమవ్వగా, బంగారం, స్టాక్ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఒక్క రాత్రిలో సీన్ రివర్స్: ట్రంప్ దెబ్బకు ఇరాన్ సేఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ప్రపంచ మార్కెట్ల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. 48 గంటల అల్టిమేటం ముగియక ముందే ట్రంప్ యూ-టర్న్ తీసుకోవడంతో యుద్ధ భయంతో వణికిపోతున్న స్టాక్ మార్కెట్లు, ముడి చమురు, పసిడి మార్కెట్లు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. సోమవారం నాటి బ్లాక్ మండే తర్వాత, మంగళవారం మార్కెట్లలో మంగళప్రదమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
26
ట్రంప్ యూటర్న్: 5 రోజుల పాటు దాడులు నిలిపివేత
ఇరాన్‌కు 48 గంటల గడువు విధించిన డొనాల్డ్ ట్రంప్, అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. రాబోయే ఐదు రోజుల పాటు ఇరాన్‌పై ఎటువంటి సైనిక దాడులు చేయవద్దని తాను రక్షణ శాఖను ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను తెరవకపోతే ఇరాన్ ఇంధన వనరులపై దాడులు చేస్తామని గతంలో హెచ్చరించిన ఆయన, ప్రస్తుతం చర్చలు సఫలమవుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
36
స్టాక్ మార్కెట్లలో భారీ రికవరీ: సెన్సెక్స్, నిఫ్టీ ఊపిరి
ట్రంప్ ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాలు వీచాయి. అమెరికాలో డౌ జోన్స్ ఫ్యూచర్స్ 769 పాయింట్లు పెరగ్గా, నాస్డాక్-100 ఫ్యూచర్స్ 2.7% వృద్ధిని నమోదు చేశాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) ఏకంగా 687 పాయింట్లు (3%) ఎగబాకి 23,150 స్థాయికి చేరుకుంది. సోమవారం సెన్సెక్స్ 1,836 పాయింట్లు పతనమై ఇన్వెస్టర్ల రూ. 14 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేయగా, ఇప్పుడు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
యుద్ధ భయంతో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన ముడి చమురు ధరలు, ట్రంప్ శాంతి మంత్రంతో ఒక్కసారిగా పడిపోయాయి. ఒక దశలో 113 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర, ట్రంప్ ప్రకటన తర్వాత 16% క్షీణించి 92 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 13.5% తగ్గి 85.28 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే చమురు ధరలు 13% మేర పతనం కావడం గమనార్హం. ఇది భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
56
బంగారం, వెండి ధరల్లో మళ్ళీ మెరుపులు
యుద్ధం తీవ్రతరం కావడంతో సోమవారం బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ మార్కెట్ క్యాప్ దాదాపు 7.3 ట్రిలియన్ డాలర్లు తగ్గింది. అయితే, యుద్ధం వాయిదా పడటంతో పసిడి మళ్ళీ పుంజుకుంది. స్పాట్ గోల్డ్ 1.66% పెరిగి 4,391 డాలర్లకు చేరుకుంది. భారత మార్కెట్ (MCX)లో బంగారం 4% రికవరీ సాధించి రూ. 1,39,396 (10 గ్రాములు) వద్ద, వెండి 3% పెరిగి రూ. 2,20,976 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు మళ్ళీ సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.
66
అమెరికా - ఇరాన్ యుద్ధం ముగిసినట్లేనా?
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం పూర్తిగా ముగిసిందని చెప్పడం ఇప్పుడే తొందరపాటే అవుతుంది. ట్రంప్ కేవలం ఐదు రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. ఈ లోపు చర్చలు సఫలమైతే, ప్రపంచ సరఫరా గొలుసుకి కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పునఃప్రారంభం అవుతుంది. అదే జరిగితే చమురు, గ్యాస్ సంక్షోభం తొలగిపోతుంది. ప్రస్తుతం నెలకొన్న ఈ సానుకూల మార్పులు మార్కెట్లలో స్థిరత్వాన్ని తీసుకువస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.