Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే

Published : Dec 19, 2025, 05:32 PM IST

Top 5 Most Expensive Metals : బంగారమే అత్యంత విలువైనదని భావిస్తుంటాము.. కానీ బంగారం కంటే విలువైన, ఖరీదైన లోహాలు చాలానే ఉన్నాయి. రోడియం నుండి ఇరిడియం వరకు 2025లో బంగారం కంటే అధిక ధర పలుకుతున్న అరుదైన లోహాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
బంగారం ధర కంటే ఈ మెటల్ ధర డబుల్.. ఎందుకో తెలుసా?

సాధారణంగా అత్యంత ఖరీదైన లోహం అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది బంగారం. కానీ వాస్తవానికి మార్కెట్‌లో బంగారం కంటే చాలా రెట్లు ఎక్కువ ధర పలికే లోహాలు ఉన్నాయి. ఖరీదైన లోహాల విషయంలో సహజంగా లభించే లోహాలకు, సింథటిక్ ఎలిమెంట్స్ (లాబొరేటరీలో తయారు చేసేవి) మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయి.

ఉదాహరణకు, కాలిఫోర్నియం (Californium) అనే సింథటిక్ ఎలిమెంట్ సాంకేతికంగా అత్యంత ఖరీదైన పదార్థం. దీని ధర గ్రాముకు దాదాపు 27 మిలియన్ డాలర్లు ఉంటుంది. అయితే, ఇది వాణిజ్యపరమైన లోహం కాదు కాబట్టి దీనిని ఈ జాబితాలోకి పరిగణలోకి తీసకోవడం లేదు.

2025 చివరి నాటికి, వాటి మార్కెట్ విలువ, పారిశ్రామిక ప్రాముఖ్యత ఆధారంగా భూమిపై సహజంగా లభించే టాప్ 5 అత్యంత ఖరీదైన లోహాల వివరాలు గమనిస్తే..

26
1. రోడియం (Rhodium - Rh)

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కమర్షియల్ మెటల్ రోడియం. దీని ధర ఒక ఔన్సు (సుమారు 28 గ్రాములు)కు దాదాపు సుమారు ₹7,28,000 నుంచి ₹7,60,000 వరకు ఉంది. అంటే బంగారంతో పోలిస్తే ఇది చాలా రెట్లు ఖరీదైనది.

రోడియం ఎందుకంత ఖరీదు?

రోడియం అత్యంత అరుదైనది. ఇది బంగారం కంటే దాదాపు 100 రెట్లు అరుదుగా లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో ప్రత్యేకంగా రోడియం గనులంటూ ఏవీ లేవు. ప్లాటినం లేదా నికెల్ తవ్వకాలలో ఇది ఒక బై ప్రోడక్టుగా మాత్రమే చాలా తక్కువ మొత్తంలో లభిస్తుంది.

రోడియం ప్రత్యేకతలు, ఉపయోగాలు ఏమిటి?

  1. అల్టిమేట్ ఫిల్టర్: దీని సరఫరాలో 80% కార్లలో ఉండే కాటలిటిక్ కన్వర్టర్ల తయారీకే ఉపయోగిస్తారు. నైట్రస్ ఆక్సైడ్ (NOx) వంటి ప్రమాదకరమైన కాలుష్య కారకాలను తొలగించడంలో దీనికి సాటి లేదు.
  2. అద్భుతమైన మెరుపు: ఇది తుప్పు పట్టదు, అద్భుతమైన రిఫ్లెక్టివ్ గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే సెర్చ్‌లైట్‌లలోని అద్దాలకు, ఖరీదైన వైట్ గోల్డ్ ఆభరణాల ప్లేటింగ్ కోసం దీనిని వాడతారు.
  3. ఇది 1,964°C (3,567°F) ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు.
36
2. ఇరిడియం (Iridium - Ir)

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఇరిడియం ఉంది. దీని ధర ఔన్సుకు సుమారు ₹4,09,500 వరకు ఉంటుంది. ఇది భూమి పొరల్లో అత్యంత అరుదుగా లభించే మూలకాలలో ఒకటి. ఉల్కలలో (Meteorites) గుర్తించారు.

ఇరిడియం ఎందుకంత ఖరీదు?

ఇది అత్యంత కఠినమైనది, అధిక సాంద్రత కలిగినది కావడంతో దీనిని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాలలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉన్నా, సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇరిడియం ప్రత్యేకతలు, ఉపయోగాలు ఏమిటి?

  1. తుప్పు పట్టని లోహం: మనిషికి తెలిసిన లోహాలన్నింటిలోనూ అత్యంత తుప్పు నిరోధక శక్తి కలిగిన లోహం ఇరిడియం. ఆమ్లాలు కూడా దీనిని ఏమీ చేయలేవు.
  2. అధిక సాంద్రత: ఇరిడియం ఆస్మియం తర్వాత రెండవ అత్యంత సాంద్రత కలిగిన మూలకం. కేవలం 6 అంగుళాల పొడవున్న ఇరిడియం ఘనం బరువు దాదాపు 100 పౌండ్లు (45 కేజీలు) ఉంటుంది.
  3. విమానాల స్పార్క్ ప్లగ్‌లు, సెమీకండక్టర్ల తయారీలో, ఫౌంటెన్ పెన్ నిబ్‌ల తయారీలో దీనిని ఉపయోగిస్తారు.
46
3. బంగారం (Gold - Au)

జాబితాలో మూడవ స్థానంలో మనందరికీ ఇష్టమైన బంగారం ఉంది. దీని ధర ఔన్సుకు $3,000 నుండి $4,300 మధ్యలో ఉంటుంది. రోడియం లేదా ప్లాటినంతో పోలిస్తే బంగారాన్ని తవ్వడం కాస్త సులభమే, కానీ దీనికి ఉన్న డిమాండ్ ఎప్పటికీ తరగదు.

బంగారం ఎందుకంత ఖరీదు?

ఇతర లోహాల మాదిరిగా కాకుండా, బంగారం పారిశ్రామిక అవసరాల కంటే పెట్టుబడి సాధనంగా, గ్లోబల్ కరెన్సీగా ఎక్కువ విలువను కలిగి ఉంది. సెంట్రల్ బ్యాంకులు నిల్వ చేసుకోవడం, ఆభరణాల తయారీ దీని ధరను నిర్ణయిస్తాయి.

బంగారం ప్రత్యేకతలు, ఉపయోగాలు ఏమిటి?

  1. వాహకత: బంగారం విద్యుత్తును అద్భుతంగా ప్రసారం చేస్తుంది. ఎప్పటికీ తుప్పు పట్టదు. అందుకే కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు, అంతరిక్ష నౌకల కనెక్టర్లలో దీనిని వాడతారు.
  2. మృదుత్వం: ఇది అత్యంత సులభంగా సాగే గుణం కలిగిన లోహం.
  3. ఇది మానవ శరీరంతో చర్య జరపదు, కాబట్టి దంతవైద్యంలో, ఔషధాలలో ఉపయోగిస్తారు. అలాగే, గోల్డ్ ను చాలా దేశాల్లో ధరించడానికి ఇష్టపడతారు. అందుకే డిమాండ్ పెరుగుతూనే ఉంది.
56
4. ప్లాటినం (Platinum - Pt)

ప్లాటినం ధర ఔన్సుకు దాదాపు $1,900 వరకు ఉంది. ఇది బంగారం కంటే 30 రెట్లు అరుదైనది.

ప్లాటినం ఎందుకంత ఖరీదు?

ప్లాటినం మైనింగ్ చాలా కష్టంతో కూడుకున్న పని. కేవలం ఒక ఔన్సు ప్లాటినం వెలికితీయాలంటే దాదాపు 10 టన్నుల ముడి ఖనిజాన్ని తవ్వి, 5 నుండి 6 నెలల పాటు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.

ప్లాటినం ప్రత్యేకతలు, ఉపయోగాలు ఏమిటి?

  1. రోడియం లాగానే, డీజిల్ ఇంజిన్ల కోసం కాటలిటిక్ కన్వర్టర్లలో దీనిని ఎక్కువగా వాడతారు.
  2. బంగారం కంటే ఇది బరువుగా, గట్టిగా ఉంటుంది, అందుకే ప్లాటినం ఆభరణాలు ఎక్కువ కాలం మన్నుతాయి.
  3. దీనిని పేస్‌మేకర్లు, కీమోథెరపీ మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
66
5. పెల్లాడియం (Palladium - Pd)

ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న పెల్లాడియం ధర ఔన్సుకు $1,600 నుండి $1,700 వరకు ఉంటుంది. ఇది ప్లాటినంకు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయం.

పెల్లాడియం ఎందుకంత ఖరీదు?

దీని ధర నేరుగా ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడి ఉంటుంది. ప్లాటినం ధర పెరిగినప్పుడు తయారీదారులు పెల్లాడియం వైపు మొగ్గు చూపుతారు. ఇది ప్రధానంగా రష్యా, దక్షిణాఫ్రికాలో దొరుకుతుంది కాబట్టి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీని ధరపై ప్రభావం చూపుతాయి.

పెల్లాడియం ప్రత్యేకతలు, ఉపయోగాలు ఏమిటి?

  1. హైడ్రోజన్ స్పాంజ్: పెల్లాడియం తన పరిమాణం కంటే 900 రెట్లు ఎక్కువ హైడ్రోజన్ వాయువును గ్రహించగలదు. అందుకే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలో ఇది కీలకం.
  2. వాహనాల పొగ నుండి వచ్చే 90% హానికరమైన వాయువులను ఇది శుద్ధి చేస్తుంది.
  3. ఎలక్ట్రానిక్ పరికరాల్లోని కెపాసిటర్ల తయారీలో కూడా దీనిని విస్తృతంగా వినియోగిస్తారు.

ఈ లోహాల ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి, కానీ వాటి పారిశ్రామిక అవసరం, అరుదైన లభ్యత కారణంగా ఇవి ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహాలుగా చలామణి అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories